హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రతిపౌరుడిపై ఉన్నదని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేదర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైకోర్టు ఆవరణలో రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ.. రాజ్యాంగ పర్యవేక్షణ బాధ్యతను కేవలం రాజకీయ, న్యాయ వ్యవస్థలకే వదిలేయకూడదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హకులు పౌరుల్లో ఎవరికైనా అందకపోతే రాజ్యాంగ పరిరక్షణలో విఫలమైనట్టేనని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని పవిత్ర గంగా నదీ జలాలతో పోల్చుతూ.. గంగోత్రి వద్ద గంగా జలాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయని, అవి కిందికి ప్రవాహించే క్రమంలో కలుషితవుతాయని చెప్పారు. రాజ్యాంగ పవిత్రతను కాపాడుకుంటేనే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా అంబేదర్ అలుపెరుగకుండా పోరాడారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శ్లాఘించారు. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒకరూ పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో జస్టిస్ నందికొండ నరసింగరావు, అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ జగన్, బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.