చిన్నరాష్ర్టాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన అంబేద్కర్.. రాష్ర్టాలు ఏర్పాటయ్యే సందర్భంలో విడిపోతున్న రాష్ర్టాల గొంతు నొక్కవద్దని చెప్పారు. విడిపోయేందుకు పూర్వపు రాష్ట్రం అనుమతి అవసరం లేదని చెప్పి, ఆనాటి రాజ్యాంగ కమిటీ బాధ్యులు వద్దని వారించినా ఆర్టికల్-3ని రాజ్యాంగంలో చేర్చారు. నాడు బాబాసాహెబ్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.
– కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. దళితజాతిలో జన్మించాడనే కారణంతో ఆయనను కొందరు కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరమని అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గొప్ప రాజ్యాంగాన్ని రచించి, ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన ఆద్యు డు అంబేద్కర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. భాష, ప్రాంతం, కుల, మతాలతో వైవిధ్యమున్న దేశంలో ఐక్యతకు కృషిచేసిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. ఆయన దూరదృష్టితో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారని కీర్తించారు. ఇదే కోవలో చిన్నరాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఆయన, రాష్ట్రాలు ఏర్పాటయ్యే సందర్భంలో విడిపోతున్న రాష్ట్రాల గొంతు నొక్కవద్దని భావించారని తెలిపారు. విడిపోయేందుకు పూర్వపు రాష్ట్రం అనుమతి అవసరం లేదని చెప్పి ఆనాటి రాజ్యాంగ కమిటీ బాధ్యులు వద్దని వారించినా ఆర్టికల్-3ని రాజ్యాంగంలో చేర్చిన గొప్ప నాయకుడని ప్రశంసించారు.
‘అంబేద్కర్ ప్రవచించిన బోధించు, సమీకరించు, పోరాడు’ అనే సిద్ధాంత స్ఫూర్తితోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకుసాగారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘పార్టీ పెట్టిన 2001లో సింహగర్జన సభా వేదిక నుంచే తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించి.. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి.. పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని ముద్దాడారు’ అని గుర్తుచేశారు. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత గొప్ప మనసుతో 100కు పైగా గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలకు పైగా వెచ్చించి నాణ్యమైన విద్యనందించారు. అంబేద్కర్, జ్యోతిబాఫూలే, వివేకానందుడి పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి శ్రీకారం చుట్టి ఏడువేల మంది నిరుపేద బిడ్డలను విదేశాలకు పంపించిన ఘనత ఆయనకే దక్కింది’ అన్నారు. అలాగే చేతిలో వనరులు లేకున్నా పిండికొద్దీ రొట్టె అన్న తరహాలో నిరుపేద దళితుల బతుకుల్లో వెలుగులు నింపే లక్ష్యంతో దళితబంధుకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.
రాజకీయంగా కొంతమేర నష్టం జరుగుతుందని తెలిసినా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్లిన ఖలేజా ఉన్న స్వాప్నికుడని అభివర్ణించారు. ‘దళితులను ధనికులుగా మార్చాలని తెచ్చిన ఈ పథకం కింద తన నియోజకవర్గంలో విజయలక్ష్మి ఇండస్ట్రీస్ పేరిట రైస్‌మిల్, కల్వకుర్తి నియోజకవర్గంలో కడ్తాల్‌లో ఓ డెయిరీ ఫాం, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ ముగ్గురు కలిసి బస్సు కొని అద్దెకు ఇచ్చారు. తొమ్మిది మంది కలిసి పెట్రోల్ పంప్ పెట్టుకున్నారు. కానీ కొందరు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందితే పొందవచ్చు. కానీ నేను మాత్రం గర్వపడుతున్నా.. అంబేద్కర్ జైభీమ్ నినాదాన్ని విధానంగా మార్చుకున్న కేసీఆర్‌కు ఆయన దళంలోని సైనికుడిగా సెల్యూట్ చేస్తున్నా’ అని చెప్పారు.
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో మహిళలు ఓటు హక్కు కోసం కోట్లాడుతున్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. మనదేశంలో అంబేద్కర్ దృఢ సంకల్పం, దూరదృష్టితో తీసుకున్న నిర్ణయంతోనే మహిళలకు ఓటు హక్కు వచ్చిందని చెప్పారు. ఆయన ఆచరించిన సిద్ధాంతాలు, విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఉద్ఘాటించారు.
‘రేవంత్ 16 నెలల పాలనలో అన్నివర్గాలు మోసపోయాయి.. కులమతాలకతీతంగా ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రోజు మీరు బయటకెళ్లి ఎవరికి ఓటేస్తరని ఎవ్వరినైనా అడగండి.. ఆటోవాలాల నుంచి అంతరిక్షంలోకి పంపే రాకెట్లు తయారుచేసే వ్యక్తి దాకా ఒకటే మాట చెప్తున్నరు.. సీఎం రేవంత్‌రెడ్డిని జల్ది ఇంటికి పంపించాలని అంటున్నరు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుంది.. ఇందులో ఏ అనుమానమూ లేదు’ అని కేటీఆర్ అన్నారు. నాడు అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయన రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట మల్లికార్జున్ ఖర్గేతో చేవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.
‘ఈ రోజు బాబాసాహెబ్ జయంతి రోజున సీఎం రేవంత్‌రెడ్డిని సూటిగా అడుగుతున్న.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటినా అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12 లక్షలు ఎంతమందికి ఇచ్చిన్రు? కనీసం 12 రూపాయలైన ఇచ్చిన్రా? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో ఎస్సీలకు రూ.6 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది? కాంట్రాక్టర్లలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10, బీసీలకు 42శాతం వాటా ఎక్కడికి పోయింది? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా మాటేమైంది? విద్యాజ్యోతి కింద ఎంతమంది విద్యార్థులకు పారితోషికమిచ్చిన్రు? అసైన్డ్ భూములపై ఎన్నివేల మంది దళిత, గిరిజనులకు పట్టాలిచ్చి హక్కులు కల్పించారు? మాటలు చెప్పిన మల్లికార్జున్‌ఖర్గే, రాహుల్‌గాంధీ ఎక్కడికెళ్లిన్రు? రెండు బడ్జెట్లు పెట్టిన ప్రభుత్వం ఈ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చిందా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బాబాసాహెబ్ పేరు చెప్పి ఓట్లడిగిన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటినా అంబేద్కర్ అభయాస్తం కింద రూ. 12 లక్షలు ఎంతమందికి ఇచ్చిన్రు? కనీసం 12 రూపాయలైన ఇచ్చిన్రా? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో ఎస్సీలకు రూ.6 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది? కాంట్రాక్టర్లలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10, బీసీలకు 42శాతం వాటా ఎక్కడికి పోయింది? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా మాటేమైంది? విద్యాజ్యోతి కింద ఎంతమంది విద్యార్థులకు సాయం చేశారు? అసైన్డ్ భూములపై ఎన్నివేల మంది దళిత, గిరిజనులకు పట్టాలిచ్చి హక్కులు కల్పించారు? మాటలు చెప్పిన మల్లికార్జున్‌ఖర్గే, రాహుల్‌గాంధీ ఎక్కడికెళ్లిన్రు? రెండు బడ్జెట్లు పెట్టిన ప్రభుత్వం ఈ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చిందా?
-కేటీఆర్
రాజ్యాంగంలో అంశాలను పొందుపరిచిన అంబేద్కర్.. మోసం చేసిన ప్రభుత్వాలను గద్దెదించడం ఎలాగో మరిచిపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన మంచివారు కాబట్టే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్సోళ్ల లాంటి దొంగలుంటరని ఊహించలేదని అభిప్రాయపడ్డారు. మోసాగాళ్లు పాలకులైతరని తెలిస్తే తప్పకుండా రీకాల్ విధానం పెట్టేవారేమోనని అభిప్రాయపడ్డారు.
ప్రజలు కులమతాలకతీతంగా ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రోజు మీరు బయటకెళ్లి ఎవరికి ఓటేస్తరని ఎవ్వరినైనా అడగండి.. ఆటోవాలాల నుంచి అంతరిక్షంలోకి పంపే రాకెట్లు తయారుచేసే వ్యక్తి దాకా ఒకటే మాట చెప్తున్నరు.. సీఎం రేవంత్‌రెడ్డిని జల్ది ఇంటికి పంపిచాలని అంటున్నరు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుంది.. ఇందులో ఏ అనుమానమూ లేదు.
– కేటీఆర్
అంబేద్కర్ జయంతి సభకు ముందు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించాయి. ఆ మహనీయుడి చిత్రపటంపై పూలుజల్లి కేటీఆర్ అంజలి ఘటించారు. ‘జోహార్ అంబేద్కర్.. నీ ఆశయ సాధనకు అంకితమవుతాం’ అంటూ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, నాయకులు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కిశోర్‌గౌడ్, అలకుంట హరి, రాజీవ్‌సాగర్, గెల్లు శ్రీనివాస్, సుమిత్రా ఆనంద్, తుల ఉమ, చిరుమల్ల రాకేశ్ పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందర ప్రజలు తనను నమ్మరనే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలను రప్పించి అనేక హామీలు ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. ‘రాహుల్‌గాంధీతో రైతు డిక్లరేషన్, ఖర్గేతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, ప్రియాంకతో యూత్ డిక్లరేషన్, మొత్తం మ్యానిఫెస్టోను సోనియాగాంధీతో చెప్పించారు..కానీ రెండేండ్లు దగ్గర పడుతున్నా అమలు చేయకుండా ప్రజలకు మొండిచెయ్యి చూపుతున్నరు.. ఈ విషయంపై సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
బిల్లుల ఆమోదంపై తమిళనాడు ప్రభుత్వం వేసిన కేసులో గవర్నర్ అధికారాలకు పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం చరిత్రాత్మకమని కేటీఆర్ అభివర్ణించారు. గతంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఆదేశాలతో తెలంగాణలోనూ గవర్నర్ ఇదే పద్ధతిలో బిల్లులను తొక్కిపెట్టారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో పోల్చితే గవర్నర్ పాత్రచిన్నదని చెప్పడం శుభపరిణామమని అన్నారు. అలాగే ‘మా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లో చేరిన్రు.. ఫిరాయింపు నిరోధక చట్టం ఆర్టికల్ 10కి ఇది పూర్తిగా విరుద్ధం. 14 నెలల కింద కోర్టులో కేసు వేసినం.. కానీ ఇంతవరకు తీర్పు రాలేదు. సత్వరమే తీర్పు వెలువరించి అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలి’ అని కోరారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ‘అంబేద్కర్ జయంతిరోజే కామారెడ్డిలో దళితుడికి ఘోర అవమానం జరిగింది. ఆ మహానేత విగ్రహం సాక్షిగా పోలీసులు ఓ దళితుడిని బట్టలూడదీసి ఈడ్చుకుపోవడం దారుణం’ అంటూ కేటీఆర్ సోమవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. దళితులపై దాడులే రాహుల్ కోరుకున్న మొహబ్బత్ దుకాణామా? అని నిలదీశారు. నిత్యం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రేవంత్ సర్కారు చేస్తున్న దాష్టీకాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బ్యానర్ కట్టిన పాపానికి ఇంత క్రూరంగా దాడిచేయడం కాంగ్రెస్ మార్క్ ఆటవిక న్యాయానికి నిదర్శనమని విమర్శించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.