MLC Elections | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రాకపోయి ఉంటే, తమ నేత సునాయాసంగా గెలిచేవారని, గెలుపు ముంగిట నిలిచిన వ్యక్తిని కాళ్లు పట్టి గుంజి కింద పడేసినట్టు అయిందని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి అనుచరులు వాపోతున్నారు. సీఎం అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలే తమ నేత కొంప ముంచాయిని విమర్శిస్తున్నారు. ఏడాది పాలన సంతృప్తికరంగా లేరని తెలిసినప్పటికీ, మాకు ఓటు వేయండని రేవంత్ రెడ్డి చెప్పడంతో పట్టభద్రులు మర్లబడ్డారని దిగువ శ్రేణి నాయకత్వం చర్చించుకుంటున్నది.
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం. ఈ స్థానాన్ని నిలుపుకొనేందుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పక్కన పెట్టి ఆర్థికంగా స్థితిమంతుడు, విద్యా వ్యాపారి వుటూరి నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించిన ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గెలవటానికి కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తే చేసింది. ఏ ఒక ఓటునూ జారవిడుచుకోవద్దనే లక్ష్యంతో ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దిం పింది. వీరు కాకుండా మొత్తం 14 వేల మం దిని ప్రచారంలో దించారు. వీరితోపాటు ముఖ్యమంత్రి కూడా కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఓటరును ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగినా ఓటమిని ఆపలేకపోయారని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.
ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లటం, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనూ ఇదే తొలిసారి. అయితే ఆయన ప్రచారమే కొంప ముంచిందని, లేకుంటే నరేందర్‌రెడ్డి సునాయాసంగా గెలిచేవారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిసి కూడా, తమ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందని మీరు అనుకుంటేనే మాకు ఓటు వేయండని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునివ్వటం తమ నాయకుని అదృష్టాన్ని మార్చివేసిందని నరేందర్ అనుచరులు విమర్శిస్తున్నారు. పట్టభద్రులను మెల్లమెల్లగా తమకు అనుకూలంగా మారుతున్న సమయంలో సీఎం వచ్చి అంతా తారుమారు చేశారని వాపోయారు.
కుల గణన సర్వే తప్పులతడక అని కాంగ్రెస్ నాయకులే ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో, బీసీ పట్టభద్రులు ఆలోచనలో పడ్డట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీసీలకు 42శాతం టికెట్లు ఇస్తామని చెప్పి, వారిలో ముస్లింలను కూడా కలపడాన్ని బీజేపీ ప్రచార అస్త్రంగా మార్చుకున్నదని అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి బాధ్యతను ఎవరు తీసుకుంటారనే అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నిక టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ పరిధిలో జరిగినందున ఆయనే బాధ్యత వహించాలనే డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిసింది. గతంలో సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, దీనికి సీఎం బాధ్యత వహించాల్సి ఉండెనని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.