BRS Party | ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దినెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై అనేక నిరాధార ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఈ వారం జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ జరిగినట్లుగా వార్తలు వచ్చాయని.. గవర్నర్ ఆమోదం వచ్చిందంటూ సీఎం కార్యాలయం నుంచి రకరకాల లీకులు మీడియాకు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై నాలుగు గోడల మధ్య చర్చ కన్నా శాసనసభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా- ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకుందని.. ఈ రేస్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరినట్లుగా నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు. అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.
నిజానికి ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని.. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని కేటీఆర్ వివరించారని తెలిపారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉందని.. శాసనసభలో ఈ అంశంపై చర్చకు అనుమతించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసన సభ వేదికగా చెబుదామని.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగున్నందున అనుకూలమైన రోజే చర్చ పెట్టాలని కోరుతున్నామన్నారు. ఈ అంశంపై శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయన్నారు.