KCR | హైదరాబాద్ సిటీబ్యూరో/సైదాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లే ఇప్పడు అక్కరకొస్తున్నాయి. అవే లేకుంటే మా బతుకు బస్టాండే’ అని మూసీ నిర్వాసితులు కేసీఆర్ మేలును తలుచుకుంటున్నారు. ఉన్న ఫలంగా ఇండ్లు ఖాళీ చేయించిన అధికారులు మమ్మల్ని ఎక్కడికి తరలిస్తుండ్రు అని తలుచుకుంటేనే భయమేసింది. సామగ్రినీ సరిగా తీసుకోకుండా బిక్కుబిక్కుమంటూ ఇక్కడికి వచ్చాం. కాంగ్రెస్ సర్కారు మోసం చేసిన ఈ తరుణంలో నాడు బీఆర్ఎస్ హయాంలో కట్టించిన ఇండ్లే దిక్కయినయ్.. అని పలువురు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సార్ చల్లంగా ఉండాలి.. అని బాధిత కుటుంబాలన్నీ దీవిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాడు పిల్లిగుడిసెల ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు నేడు మూసీ నిర్వాసితులకు వరంగా మారాయి. రూ.29.41 కోట్ల వ్యయం తో నిర్మించిన 288 ఇండ్లలో 2021 ఆగస్ట్ 28న అనాటి మంత్రి కేటీఆర్ 141 మంది లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించగా, మిగిలిన 147 ఇండ్లను ప్రస్తుత రాష్ట్ర ప్రభు త్వం శంకర్‌నగర్, మూసానగర్ నిర్వాసితులకు కేటాయించింది. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఇస్తామన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎవరు కట్టించిండ్రు? కేసీఆర్ కట్టించిన ఆ ఇండ్లే ఇప్పుడు మాకు దిక్కయ్యాయి కదా అని అబ్ధుల్ సత్తార్ ఖురేషి తదితరులు ముక్తకంఠంతో చెప్తున్నారు.