Congress | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త మోసానికి తెరలేపింది. ‘క్యూఆర్ క్యాంపెయిన్’ పేరుతో ఆన్లైన్లో ప్రజల వివరాలను సేకరిస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల కార్డులను అందిస్తామంటూ ఓ లింక్‌ను అందరికీ పంపుతున్నది. ఇందులో వ్యక్తి పేరు, ఫోన్ నంబర్ వివరాలు ఇచ్చి, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏది కావాలో ఎంచుకొని క్లిక్ చేస్తే పేరు, ఫోన్ నంబర్‌తో గ్యారెంటీ కార్డులు తయారవుతున్నాయి. ఇది పెద్ద మోసమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగా అర్హత ఉన్నదా? లేదా అని కనీసం చెక్ చేయకుండా ఆటోమెటిక్‌గా కార్డులు తయారవుతున్నాయని తెలిపారు.
ఉదాహరణకు పురుషులకు కూడా ‘మహాలక్ష్మి పథకం’ కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ కార్డు ఇస్తున్నారు. పైగా ఈ గ్యారెంటీ కార్డులకు ఎలాంటి విలువ లేదని స్పష్టం చేస్తున్నారు. అయినా ఓటర్లకు ఆశ చూపడం, మైండ్ గేమ్ ఆడటమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్తున్నారు. క్యూఆర్ క్యాంపెయిన్ పేరుతో నియోజకవర్గాలవారీగా ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నదని పేర్కొంటున్నారు. ఆయా నంబర్లకు తమ కాల్ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి, మెసేజ్‌లు పంపుతారని, నేతలు ప్రలోభ పెట్టేందుకు అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.