జగిత్యాలటౌన్, ఫిబ్రవరి 2 : రాజేందర్‌నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిరసన తెలిపారు. తరగతులను బహిష్కరించి ధర్నా చేశారు. అనంతరం విద్యార్థులు ర్యాలీ తీసి మానవహారం నిర్మించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతాంగానికి సేవలు అందిస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములను హైకోర్టు నిర్మాణానికి ఇవ్వడం వల్ల వ్యవసాయ పరిశోధనలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న వివిధ జీవ వైవిద్య వృక్ష, జంతు సంపదకు హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 55ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.