హైదరాబాద్, మార్చి 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్‌కు మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు తాజాగా సీపీఐ బృందం సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, పల్లె నర్సింహ బృందం పీసీసీ చీఫ్‌ను కలిశారు. తమ పార్టీ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే సీపీఐ ఒక సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడింది.
ఈ ఎన్నికల్లోనే సీపీఐకి ఎమ్మెల్సీ సీటు ఇస్తే దశాబ్దంన్నర తర్వాత ఉభయ సభల్లో ఆ పార్టీకి ప్రాతినిథ్యం దక్కనున్నది. టీజేఎస్ కూడా అంతర్గతంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా ఎంఐఎం, కాంగ్రెస్ సఖ్యతతో ఉన్న నేపథ్యంలో ఒక స్థానం ఎంఐఎంకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. తర్వాత మరో ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని తెలిపారు.