బిగ్ రోడ్.. బిగ్ దందా !
నార్సింగి రోడ్ అలైన్మెంట్లో తవ్వినకొద్దీ అక్రమాలు.. వెస్ట్రన్ మిడోస్లోని ఓపెస్ స్పేస్ పైనా రియల్టర్ కన్ను
- సూత్రధారులు, అధికారుల్లోనూ నమస్తే తెలంగాణ కథనం కలకలం
- 40 కోట్ల విలువైన భూమిని అగ్గువకు కొట్టేసేలా స్కెచ్
- బిగ్‌బ్రదర్ అరాచకంపై ‘7హిల్స్’ వాసుల ఆవేదన
- కష్టపడి కొనుక్కున్న ఇండ్లల్లో చిచ్చు పెట్టొద్దని వేడుకోలు
- మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు
- హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఎస్బీ, ఇంటెలిజెన్స్ ఆరా
సామాన్యుడిని సమిధను చేసి, అందినకాడికి భూమిని మింగేయాలని చూస్తున్న ‘బిగ్’ ముఠా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నార్సింగిలో వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్చి, పదుల సంఖ్యలో ఉన్న అపార్ల్మెంట్ల కూల్చివేతకు పథకం పన్నిన విషయం ‘నమస్తే తెలంగాణ’ బయట పెట్టగానే పెద్దఎత్తున కలకలం మొదలైంది. బాధితులు ముందుకొచ్చి ఇన్నాళ్లుగా తాము చేసిన ఫిర్యాదులను వివరిస్తుంటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిగ్‌బ్రదర్ కలిసి చేస్తున్న కుతంత్రాలపై స్థానికులు మరింత సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలో తవ్వినకొద్దీ అలైన్మెంట్ అక్రమాలు బయటపడుతున్నాయి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను మింగే కుతంత్రాలు బద్ధలువుతున్నాయి.
వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్పు కుట్రలో భాగంగా రెండుచోట్ల హెచ్ఎండీఏ ప్లాట్లను అగ్గువకు కొట్టేసిన బిగ్‌బ్రదర్ ముఠా.. పలు ప్రైవేట్ భూములపైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసుకున్నది. దీంతోపాటు వెస్ట్రన్ మిడోస్‌లో ఓపెన్ స్పేస్ కింద వదిలేసిన 15 గుంటల భూమిపైనా అక్రమార్కులు కన్నేసినట్టు తేలింది. సుమారు 40 కోట్ల ధర పలికే ఈ స్థలాన్నీ ప్రభుత్వ భూమిగా చూపించి, వేలంలో దాన్ని అగ్గువకు కొట్టేసేలా పథకం పన్నినట్టు సమాచారం. ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం కూడా జరిగిన ఈ స్థలాన్ని ఇందుకోసమే చదును చేయించారని తెలిసింది. నమస్తే తెలంగాణ కథనంతో ముఠా ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయ్యిందని స్థానికులు చెప్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రియల్ వ్యాపారం కోసం సామాన్యుల ఆస్తుల్ని బలిపెట్టడమే కాదు.. అందినకాడికి ప్ర భుత్వ, ప్రజాప్రయోజన స్థలాలనూ అమాం తం మింగేయాలనుకొన్నది ‘బిగ్’ ముఠా. ఇందులో భాగంగా మరో పెద్ద కుట్రను కూడా పన్నినట్టు తాజాగా తెలుస్తున్నది. నార్సింగిలో వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్పు కుట్ర లో భాగంగా బిగ్ బ్రదర్ సహా రాయలసీమ రియల్టర్ మరిన్ని భూములపైనా కన్నేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నార్సింగిలోని మాస్టర్‌ప్లాన్‌లో వంద ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చి పదుల సంఖ్యలోని అపార్టుమెంట్లల్లో వేలాది ఫ్లాట్లను కూల్చేందుకు హెచ్ఎండీఏ సి ద్ధమైన అరాచకంపై ‘నమస్తే తెలంగాణ’ గురువారం ‘కొంపలు కూల్చే బిగ్ రోడ్డు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం సూత్రధారులు, పాత్రధారులతోపాటు అధికారు ల్లోనూ కలకలం రేపింది.
రాత్రికి రాత్రి పనులు ఆపేసి..
నిన్నమొన్నటి వరకు రాత్రింబవళ్లు జేసీబీలతో భూములను చదును చేసిన యం త్రాంగం ‘నమస్తే’ కథనంతో అప్రమత్తమై అన్ని పనులు నిలిపివేశారు. నార్సింగి సర్వే నెంబర్ 103, 105ల్లోని ప్రభుత్వ భూముల్లో హెచ్ఎండీఏ ప్లాట్లుగా చేసి వేలం వేసింది. అయితే వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్పు కుట్రలో భాగంగా బిగ్ బ్రదర్ కనుసన్నల్లో జరిగిన ఈ వేలం ప్రక్రియలో అధికారులు రాయలసీమకు చెందిన రియల్టర్‌కు అనుకూలంగా వ్యవహరించారు. ఈ మేరకు చదరపు గజం లక్షల్లో ధర పలుకుతుంటే నామమాత్రపు ధరకే ఆయనకు చెందిన కంపెనీలకు కట్టబెట్టారు.
అయితే వెస్ట్రన్ మిడోస్, సెవెన్‌హిల్స్ పరిసరాల్లో ఉండే ఈ ప్లాట్లను గత కొన్నిరోజులుగా చదును చేస్తున్నారు. వాస్తవానికి హెచ్ఎండీఏ అధికారులు వేలానికి ముందే ఈ భూముల్ని చదును చేసి, రోడ్డును చూపి బిడ్డర్లను ఆకర్షించి వేలం నిర్వహించాలి. కానీ అందుకు భిన్నంగా కంప చెట్లు ఉన్న సమయంలోనే గుట్టుగా ముగించి ఇప్పుడు చదును చేస్తున్నారు. అయితే గురువారం ‘నమస్తే’ కథనం రావడంతో నిన్నటిదాకా నడిచిన ఈ పనుల్ని నిలిపివేశారు. ఈ వ్యవహారంలో రూ.150 కోట్ల మేర ఒకే సంస్థకు ప్రయోజనం దక్కిందన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరుపాలని పలువురు డిమాండ్ చేశారు.
‘నమస్తే’ ఎఫెక్ట్.. కదిలిన యంత్రాంగం
‘కొంపలు కూల్చే బిగ్ రోడ్డు’ శీర్షికన ‘నమస్తే’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. అధికార యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. అలైన్మెంట్ మార్పుతో తీవ్ర ఆవేదన చెందుతున్న నార్సింగి పరిధిలోని వెస్ట్రన్ మిడోస్, సెవెన్ హిల్స్ కాలనీల దగ్గరకు గురువారం ఉదయం పలు శాఖల అధికారులు వచ్చి ఆరా తీశారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ, స్పెషల్ బ్రాం చ్, ఇంటెలిజెన్స్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. రహదారి అలైన్మెంట్, దాని వల్ల నివాసితులకు ఎదురయ్యే ఇబ్బందులు, స్థానికుల అభ్యంతరాలపై వివరాలు సేకరించారు.
పర్యటన సందర్బంగా వెస్ట్రన్ మిడోస్, సెవెన్ హిల్స్ కాలనీల ప్రతినిధులు అధికారులను కలిసి తమ సమస్యలను వివరించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్ వ్యవహారశైలితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు సైతం రాజకీయాలకు అతీతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితుల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని కోరారు. అధికారుల పర్యటనతో సమస్యపై కదలిక వచ్చినప్పటికీ,బాధితులకు స్పష్టమైన భరోసా, న్యాయబద్ధమైన పరిష్కారం లభించినప్పుడే తమ ఆందోళనకు తెరపడుతుందని వారు పేర్కొన్నారు.
నిరకుంశంగా విరమించాలి
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, అత్యంత నిరంకుశంగా రోడ్డు అలైన్మెంట్లో అసంబద్ధ మార్పులు చేసి తమ నివాసాలను కూల్చివేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ 7హిల్స్వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొందరు పెద్దల స్వార్థం, ఒత్తిళ్లతో జరుగుతున్న ఈ కుట్రలో హెచ్ఎండీఏ అధికారులు అన్యాయంగా అలైన్‌మెంటు మార్పునకు సహకరించినట్లు ఆరోపించారు. ఈ మేరకు మున్సిపల్, రెవిన్యూ ఉన్నతాధికారులకు 7హిల్స్వాసులు ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆ లేఖ ప్రకారం.. ‘రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 118, 119, 168లో 7.5 ఎకరాల విశాల స్థలంలో పవర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2008లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మించారు.
పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, సీఈఏ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఇతర వృత్తులకు చెందిన సుమా రు 853 కుటుంబాలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఈ గృహ సముదాయంలో ఫ్లాట్లను కొనుగోలు చేసి ప్రశాంతంగా జీవిస్తున్నాం. 2009లోనే హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం అన్నిరకాల అనుమతులు తీసుకుని, పకా ఇంజనీరింగ్ ప్రమాణాలతో ఈ భవనాలను నిర్మించారు. మొదటి 6 టవర్లకు 2014లో, 7వ టవర్‌కు 2021లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. 2026 సెప్టెంబర్ 26న హెచ్ఎండీఏ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ సిబ్బంది అపార్ట్మెంట్ దక్షిణ, ఉత్తర వైపుల ఉన్న ప్రహరీ గోడలపై పెయింట్ మారింగ్లు చేశారు.
మాస్టర్ ప్లాన్- 2031 ప్రకారం అపార్టుమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద ఎలాంటి 100 అడుగుల రోడ్డు లేనప్పటికీ, ప్రస్తుతమున్న 60 అడుగులు (దక్షిణ వైపు), 40 అడుగుల (ఉత్తర వైపు) రోడ్లను ఏకంగా 100 అడుగులకు విస్తరిస్తామంటూ హడావుడి చేశారు. ఈ మేరకు గెజిట్ కూడా జారీ చేశారు. దీంతో పాటు కేవలం పేద, మధ్యతరగతి ఇండ్లను లక్ష్యంగా చేసుకుని, హెచ్ఎండీఏ చేసిన మారింగులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అపార్టుమెంట్ బేస్మెంట్ల లోపలికి (సుమారు 36 అడుగుల లోతు వరకు) ఈ మార్కింగ్ ఉంది. దీని ద్వారా భవనాల నిర్మాణ స్వరూపాన్ని దెబ్బతీసి కూలిపోయేలా చేస్తుంది. ఈ అసంబద్ధమైన విస్తరణ ప్రతిపాదనలతో వందలాది కారు పారింగ్ స్లాట్లు కోల్పోవడంతో పాటు, ఎస్టీపీ, ఫైర్ పంపింగ్ సిస్టమ్స్, తాగునీటి ట్యాంకులు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు పూర్తిగా ధ్వంసమవుతాయి. వేలాది మంది భక్తులు దర్శించుకునే వినాయక ఆలయం కూడా ఈ కూల్చివేతలో పోతుంది. వాస్తవానికి అపార్టుమెంటు ముందు ఉన్న 60, 40 ఫీట్ల రోడ్ల అవతల ఖాళీ ప్లాట్లు ఉన్నాయి.
వాటిని వదిలేసి వందలాది కుటుంబాలున్న నివాస సముదాయాల్లోకి బలవంతంగా రోడ్లను తీసుకురావడం వెనుక పెద్దల స్వార్థ ప్రయోజనాలున్నాయి. రోడ్ల విస్తరణ పేరుతో భారీగా చెట్లను నరికివేయాల్సి రావడంతో పర్యావరణం దెబ్బతిననున్నది. ఇప్పటికే ఉన్న రోడ్ల కోసం గతంలోనే దాదాపు 2వేలకు పైగా చదరపు గజాల స్థలాన్ని ఇచ్చారని, ఈ క్రమంలో అవసరంలేని రోడ్ల విస్తరణ పేరిట మళ్లీ మా ఇండ్లను కూల్చడం న్యాయం కాదు. ఈ ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉన్నతాధికారుల బృందాన్ ఏర్పాటు చేయండి. అన్ని వాస్తవాలను వాళ్ల ముందు ఉంచుతాం’ అని ఫిర్యాదులో 7హిల్స్వాసులు పేర్కొన్నారు.
భగ్గుమన్న నెటిజన్లు
బిగ్ బ్రదర్ అరాచకాలపై కాలనీవాసులు సహా నెటిజన్లు కన్నెర్రజేస్తున్నారు. రాయలసీమ రియల్టర్‌తో కలిసి బిగ్ బ్రదర్ వేల కోట్ల రియల్ వ్యాపారం కోసం సామాన్యుల ఆస్తులను సమిధగా మార్చడంపై ఆవేదన చెందుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ‘బిగ్’ అరాచకాలపై సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోశారు. రేవంత్ పాలన అంటేనే కొంపలు కూల్చేపాలన అని సీటీమార్ పేరిట ఓ నెటిజన్ పోస్ట్ చేయగా, కొంపలు కూల్చుడే అసలైన మార్పు అంటూ పీ రవి అనే నెటిజన్ కామెంట్ చేశారు. సామాన్యుల భారీ భవంతులను టార్గెట్ చేశారని జ్ఞానేశ్ అనే నెటిజన్ మండిపడ్డారు.
15 గుంటల భూమిపైనా నజర్…
వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్పు కుట్రలో భాగంగా ఇప్పటికే రెండుచోట్ల హెచ్ఎండీఏ ప్లాట్లను అగ్గువకు కొట్టేసిన బిగ్ బృందం పలువురు ప్రైవేట్ భూములపైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసుకొన్నట్టు తెలిసింది. దీంతో పాటు అలైన్మెంట్ మార్పుతో రోడ్డును అనుసరించి వచ్చే మరో 15 గుంటల భూమిపైనా కన్నేసినట్లు తాజాగా పలువురు స్థానికులు ‘నమస్తే తెలంగాణ’ దృష్టికి తీసుకువచ్చారు. సదరు రాయలసీమ రియల్టర్ గతంలో నార్సింగి సర్వేనెంబర్లు 98-100, 102, 104, 114-116, 121-125, 168(పార్టు)ల్లో ఏండ్ల కిందట భారీ లేఅవుట్ చేశారు. అందులో 15 గుంటల భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వదిలివేశారు. అందులోనే ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం కూడా జరిగింది. గతంలో అది ప్రభుత్వ భూమి అనే వాదన తెరపైకి వచ్చినపుడు ఇదే రియల్టర్ అది లేఅవుట్లో భాగమైన భూమిగా వాదించి, అందులో భాగంగానే ఇదంతా చేశారు. కానీ ఇప్పుడు దానిని ప్రభుత్వ భూమిగా చూపేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. సుమారు రూ.35-40 కోట్ల విలువ చేసే ఆ భూమిని ప్రభుత్వ ఖాతాలో వేసి హెచ్ఎండీఏ ద్వారా వేలంలో అగ్గువకు దక్కించుకునేందుకు స్కెచ్ వేసినట్టు స్థానికులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

