హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వరుసగా అవినీతి ఆరోపణలు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కిందిస్థాయి నుంచి పైవరకు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. హెచ్వోడీలను కూడా మార్చనున్నట్టు సమాచారం.
జిల్లాల్లోని డీఎంహెచ్‌వో కార్యాలయాలు మొదలు హైదరాబాద్‌లోని హెచ్‌వోడీల కార్యాలయాల వరకు ఏండ్లకేండ్లుగా తిష్టవేసి విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నవారి గురించి ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నట్టు సమాచారం. ప్రక్షాళనను ముందుగా బదిలీల ప్రక్రియతో మొదలుపెట్టనున్నారు. ఐదేండ్లకుపైబడి ఒకే చోట పనిచేస్తున్నవారిని కదిలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఇప్పటికే డీపీహెచ్, డీఎంఈ, టీవీవీపీ, ఇతర విభాగాల నుంచి వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి జాబితా చేరింది. త్వరలోనే బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది. తద్వారా ఏండ్లకేండ్లుగా హైదరాబాద్, ఇతర నగరాల్లో పాతుకుపోయినవారిని కదిలించే అవకాశం ఉన్నదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత డీఎంహెచ్‌వోలపై దృష్టి పెట్టనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న డీఎంహెచ్‌వోల్లో సగం మందికి పైగా మార్చి, కొత్తవారికి అవకాశం ఇస్తారని చెప్పుకుంటున్నారు.
అవినీతి.. లైంగిక వేధింపులు
కొన్ని నెలలుగా పలువురు డీఎంహెచ్వోలు, ఇతర అధికారులపై విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత జనవరిలో జనగామ డీఎంహెచ్‌వో ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ అస్గర్ కలిసి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చికారు.
ఇక డీపీహెచ్ రవీందర్నాయక్తోపాటు మెదక్ డీఎంహెచ్‌వో చందూనాయక్ డబ్బులు తీసుకొని బదిలీలు చేస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి ఆరోపణలు చేసిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘనటలో మొదట్లో నష్టనివారణ చర్యగా ఆ మహిళను సస్పెండ్ చేసినా.. తర్వాత మెదక్ డీఎంహెచ్‌వో చందూనాయక్‌పై వేటు వేశారు.
అదే కార్యాలయంలో ఓ ఉద్యోగి నిరుడు డిసెంబర్లో ఏసీబీకి చిక్కారు. డీపీహెచ్ కార్యాలయ సూపరింటెండెంట్ సలావుద్దీన్ నిజామాబాద్‌కు చెందిన ఓ స్టాఫ్‌నర్స్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సరూర్‌నగర్ పోలిస్స్టేషన్లో కేసు నమోదైంది. ఐసీసీ కమిటీ నివేదిక మేరకు సలావుద్దీన్‌ను సస్పెండ్ చేశారు.
హెచ్వోడీలు సైతం..
ప్రస్తుతం డీపీహెచ్, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీలుగా ఇన్చార్జీలు కొనసాగుతున్నారు. డీపీహెచ్, డీఎంవో పోస్టులపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నది. కోర్టు నుంచి ఆదేశాలు రాకముందే ఆ పోస్టులను రెగ్యులర్ అధికారులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సీనియార్టీ జాబితా కూడా సిద్ధమైనట్టు తెలుస్తున్నది. టీజీఎంఎస్ఐడీసీ ఎండీని కూడా నియమిస్తారని తెలుస్తున్నది.
టీవీవీపీ కమిషనర్‌ను సైతం మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు సైతం మొదటి నుంచీ అయిష్టంగానే కొనసాగుతున్నారని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మొదట్లోనే ఆ బాధ్యతలు వద్దని ఆమె చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇలా క్షేత్రస్థాయి మొదలు హెచ్‌వోడీల వరకు వైద్యశాఖను రెండుమూడు నెలల్లో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.