సంగారెడ్డి, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/పటాన్చెరు: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాలపై గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సోదాలు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయి. పటాన్చెరు పాతపట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో, శాంతినగర్‌లోని మధుసూదన్‌రెడ్డి నివాసంలో ఈడీ విడివిడిగా సోదాలు నిర్వహించింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. మొదట ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు. మహిపాల్‌రెడ్డితోపాటు కుటుంబసభ్యులను విడివిడిగా ప్రశ్నించారు. అనంతరం ఆకస్మికంగా ఎమ్మెల్యే నివాసం సమీపంలో ఉన్న కార్యాలయంలో, అలాగే వాహనాలను కూడా తనిఖీ చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వాహనాల్లో ఉన్న ఫైళ్లు, పత్రాలను పరిశీలించారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు ఎవరినీ ఎమ్మెల్యే నివాసంలోకి అనుమతించలేదు. ఈడీ అధికారులు మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి నివాసాల నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని జిరాక్స్ పత్రాలను తీసుకెళ్లినట్టు తెలిసింది. మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఈడీ అధికారులు ఎలాంటి అరెస్టులు చేయకుండా హైదరాబాద్ తిరుగుపయనం అయ్యారు. బినామీ పేర్లతో వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఫిర్యాదులు అందటం వల్లనే ఈడీ అధికారులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటిపై దాడులు చేసినట్టు తెలిసింది.
తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులకు తాను, తన కుటుంబసభ్యులు పూర్తిగా సహకరించినట్టు తెలిపారు. పార్టీ మార్పుతోపాటు ఇతర రాజకీయ అంశాలు దాడుల వెనుక దాగి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సందర్భం కాదని తనపై జరుగుతున్న రాజకీయకుట్రల వివరాలను సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని అన్నారు. రాజకీయంగా తనను బలి చేసేకుట్ర జరుగుతున్నదని దానిని సమర్థంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తాను, తన కుటుంబసభ్యులు ఎలాంటి వ్యాపారాలు చేయటంలేదని చెప్పారు. నిబంధనలు అనుమతించిన మేరకే బంగారం, ఇతర వస్తువులు కలిగి ఉన్నామని అన్నారు. ఈడీ తనను, కుటుంబసభ్యలను విచారించిందని, తాము నిబంధనలు అతిక్రమించినట్టు ఎక్కడా తేలలేదని తెలిపారు. తన ఇంటి నుంచి ఈడీ ఏమీ స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన జిరాక్స్ ప్రతులను మాత్రమే తీసుకెళ్లారని తెలిపారు. ఈడీ సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈడీ దాడులు వందశాతం రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. తనపై జరుగుతున్న కుట్రలను రాజకీయంగా ఎదుర్కొంటానని అన్నారు.