(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తెలంగాణలో భారత రాష్ట్ర సమితికే (బీఆర్ఎస్) అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆ పార్టీకి బీజేపీ నుంచి సవాళ్లు ఉన్నప్పటికీ, బీజేపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు బీఆర్ఎస్కు అనుకూలంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి’.. ఇది ఏ బీఆర్ఎస్ నాయకుడి నోటినుంచో వచ్చిన మాట కాదు.. సాక్షాత్తు బీజేపీ బాకాగా ముద్రపడిన స్వరాజ్య పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్ జగన్నాథం చేసిన విశ్లేషణ ఇది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న 9 రాష్ర్టాల్లో ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్న కోణంలో ఆర్ జగన్నాథం ఓ ఆంగ్ల పత్రికకు విశ్లేషణ వ్యాసం రాశారు. ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పెద్ద రాష్ర్టాల్లో ఒకటైన తెలంగాణలో మాత్రం తిరిగి బీఆర్ఎస్ పార్టీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్కు బీజేపీ సవాళ్లు విసురుతున్నప్పటికీ, ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు (ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, వృద్ధి రేటులో మందగమనం, ఉద్యోగాల కల్పన, ఉచితాల రద్దు నినాదం, సీనియర్ సిజిజన్స్‌కు పన్ను రాయితీ ఎత్తివేత, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఇత్యాది అంశాలు) భారత రాష్ట్ర సమితికే రాజకీయంగా అనుకూలించే అవకాశం ఉంది’ అని ఆర్ జగన్నాథం తన విశ్లేషణలో పేర్కొన్నారు.
తెలంగాణ మినహా మిగిలిన రాష్ర్టాల్లో కాంగ్రెస్ సానుకూలతలపైనా జగన్నాథం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటకలో ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ హామీ ఇస్తున్నది. ఇదే హామీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు విజయం చేకూర్చేందుకు దోహదపడిందని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బలంగా నమ్ముతున్నారు. రాజస్థాన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌లోనూ తిరిగి అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నది. మధ్యప్రదేశ్‌లోనూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తంచేస్తున్నది’ అని ఆర్ జగన్నాథం విశ్లేషించారు. మధ్యప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ర్టాల్లో బీజేపీ దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అనుకూల పత్రిక ఎడిటోరియల్ డైరెక్టరే బీజేపీకి ఎదురవుతున్న ప్రతికూలతలను అంగీకరిస్తుండటం గమనార్హం.