హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): పేదల జోలికి వస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. పోలీసు యంత్రాంగం, బుల్డోజర్లు చేతిలో ఉన్నాయని పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రతి గుడిసెకూ పట్టా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి’ అని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెలుగుమట్ల, హనుమకొండలోని గుండ్లసింగారం, గోపాలపురం, మహబూబాబాద్, యాదాద్రి జిల్లా కొలనుపాక, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో వరుసగా జరిగిన కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు. భూదాన్ భూములు, ప్రభుత్వ భూములను ల్యాండ్ మాఫియా దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, పేదలు తలదాచుకోవడానికి గుడిసె వేసుకొంటే మాత్రం కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేతనైతే పెద్ద కబ్జాకోరులను పట్టి జైల్లో పెట్టండి, మేం స్వాగతిస్తూ మీకు దండలు వేస్తాం అని అన్నారు. వరంగల్ గుండ్లసింగారంలో కలెక్టర్ స్వయంగా వెళ్లి కూల్చివేతలు జరుపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.