హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్‌పై కదంతొక్కడానికి డ్రైవర్లంతా ఏకమవుతున్నారు. తమ సమస్యలను పట్టించుకోని సర్కారు మెడలు వంచేందుకు సిద్ధమవుతున్నారు. ప్యాసింజర్, గూడ్స్ డ్రైవర్లంతా జేఏసీగా ఏర్పడి మహాధర్నా చేయనున్నారు. ఇప్పటికే ఆటోడ్రైవర్లు రేవంత్ సర్కార్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్యాసింజర్, గూడ్స్ డ్రైవర్లు కూడా పోరుబాట కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు. ఈ రేవంత్ సర్కార్‌లో మాత్రం అట్లాంటి పరిస్థితి లేదని వాపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ఇప్పటికీ నెలకొల్పలేదని డ్రైవర్లు ధ్వజమెత్తారు. పార్కింగ్ సమస్య అలాగే ఉన్నదని, ఇష్టానుసారంగా చలాన్లు విధిస్తున్నారని తెలిపారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయని వెల్లడించారు. అందుకే తెలంగాణ వాహన సంఘాలన్నీ ఏకమై రేవంత్ సర్కార్‌పై పోరు జరుపాలని నిర్ణయించినట్టు చెప్పారు.
బీఎంఎస్, టీఎన్టీయూసీ, జేఎస్పీటీయూ, బీపీటీఎంఎం, టీఆర్ఏకేటీయూ, టీఏడీయూ,ఎన్టీఏడీయూ, జీహెచ్ఎస్వీడీయూ, టీఎస్ఎల్కేఎస్, టీఎస్టీడీయూ తదితర సంఘాలన్నీ తెలంగాణ ఆటో అండ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ల జేఏసీగా ఏర్పడి అక్టోబర్ 29న మహాధర్నా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఏఐటీయూసీ, బీఆర్టీయూ, సీఐటీయూ, టీయూసీఐ, జీయూటీఎస్, యూటీఏడీడబ్ల్యూ, టీఏడీఎస్ తదితర సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి నవంబర్ 5న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చాయి.
యూనియన్ నాయకుడు రవిశంకర్ అట్లూరి మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వంలో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇండ్లులేని డ్రైవర్లకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం కేటాయించాలని కో రారు. గిరాకీ లేక ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సూ చించారు. బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో డ్రైవర్లు తమ సమస్యలను చెప్పుకుంటే సత్వరమే పరిష్కారమయ్యేవని చెప్పారు. గతంలో రెండు త్రైమాసిక వాహన పన్నును కేసీఆర్ రద్దు చేశారని గుర్తు చేశారు. రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా తీసుకొచ్చారని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం డ్రైవర్ల ఆత్మహత్యలే లక్ష్యంగా కక్ష సాధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వాహన సంఘాలన్నీ కలిసి నవంబర్ 5న మహాధర్నాకు పిలుపునిచ్చామని వెల్లడించారు.