Mahabubabad | నమస్తే తెలంగాణ నెట్వర్క్: భారీవర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. జిల్లాలో 29.67 సెంటీమీటర్లు సగటు వర్షపాతం నమోదవగా, అత్యధికంగా చిన్నగూడూరులో 45.06 సెంటీమీటర్లు కురిసింది. రైలు, రోడ్డు మార్గాలన్నీ పూర్తిగా బంద్ అయ్యాయి. చెరువులకు గండ్లు పడి వేలాది ఎకరాల పంట నీట మునిగింది. సుమారు 20 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఇతర పంటలు నీట మునిగినట్టు ప్రాథమిక అంచనా. కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద రెండు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఇంటికన్నె వద్ద 417వ మైలురాయి నుంచి 418వ మైలురాయి వరకు, 418వ నుంచి 420వ మైలురాయి వరకు రెండు చోట్ల ట్రాక్ కొట్టుకుపోయింది. మహబూబాబాద్, తాళ్ల పూసలపల్లి మధ్య మంద కొమురమ్మ నగర్ వద్ద ఉన్న 432వ, 433వ మైలురాయి వరకు ట్రాక్ దెబ్బతిన్నది.
పట్టాల మధ్యలో బుంగ పడి కుంగిపోయింది. దీంతో సిబ్బంది సమాచారంతో కొన్ని రైళ్లు డోర్నకల్ జంక్షన్లో, మరికొన్ని మహబూబాబాద్, మరో రెండు రైళ్లు కేసముద్రం రైల్వేస్టేషన్లలో నిలిచిపోయాయి. ఆయా చోట్ల రైల్వే ప్రయాణికులు అర్ధరాత్రి వేళ అవస్థలు పడ్డారు. స్థానికులతోపాటు పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, కులసంఘాలు ఆహారాన్ని తీసుకొచ్చి ప్రయాణికులకు అందజేశారు. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. నెల్లికుదురు మండలంలోని రాజుకొత్తపల్లి చెరువుకట్ట తెగి సమీప ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరాయి. సుమారు 36 గొర్రెలు నీటిలో కొట్టుకుపోగా, 19 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. నాలుగు ఇండ్లు నేలమట్టమయ్యాయి.