మహబూబ్నగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సర్వే నంబర్ 252లో జరిగిన అక్రమాలపై స్వచ్ఛందంగా విచారణ కోరుతూ తీర్మానం చేయాలని అఖిలపక్షం నిర్ణయించడం సంచలనాత్మకంగా మారింది. కొన్ని రోజులుగా ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలకు స్పందించిన గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మామూలుగా గ్రామసభల్లో పంచాయతీ సమస్యలపై తీర్మానాలు చేయడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా తమ గ్రామంలో జరిగిన పరిహారం పంపిణీలో వస్తున్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ముందుకు రావడం ఆశ్చర్యపరుస్తున్నది. తమ గ్రామంలో సర్కార్ భూమి 252 సర్వే నంబర్లో పూర్తిస్థాయిలో హద్దులు నిర్ణయించడం.. ఆరోపణలపై చర్చ.. తీర్మానం చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది.
ఈ మేరకు సర్పంచ్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేసి ఆరోపణల పై విచారణ కోరడం దీనికి సంబంధించి తీర్మానం చేయాలని నిర్ణయించడంతో ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న కథనాలు నిజమేనని పరోక్షంగా అంగీకరించినట్టయింది. ఇలావుండగా పదిరోజుల నుంచి మల్టీపర్పస్ పార్కు భూపరిహారంలో ఆరోపణలు వస్తున్నా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు విచారణ చేపట్టలేదు. కనీసం వాస్తవమా? కాదా? అని తేల్చలేదు. గ్రామస్తులు ముందుకు వచ్చి అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక సమావేశం కావడం అధికారులకు చెంపపెట్టుగా మారింది.