మల్యాల, జూలై 18 : మనసున్న మహారాజు కేసీఆర్ అని, ఉద్యమకారుడికి ఏ మాత్రం కష్టం వచ్చినా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని అండగా ఉండాలని తనకు సూచించారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త, ఉద్యమకారుడు క్యాతం శ్యాంసుందర్‌రెడ్డికి మెదడులో రక్తం గడ్డకట్టడంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అతడికి వైద్యం అందించేందుకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ మేరకు బాధితుడిని హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించి చికిత్స చేయిచారు. అనంతరం వైద్య ఖర్చులను పూర్తిస్థాయిలో చెల్లిస్తామని దవాఖాన యాజమాన్యానికి తెలుపడంతోపాటు, కుటుంబానికి అండగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యేను కేసీఆర్ ఆదేశించారు. శ్యాంసుందర్‌రెడ్డి రెండురోజుల క్రితం దవాఖాన నుంచి డిశ్చార్జి అయి రాంపూర్‌కు రాగా, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలసి వెళ్లి కోరుట్ల ఎమ్మెల్యే పరామర్శించారు. వైద్యఖర్చులకు రూ.70,308 చెక్కును శ్యాంసుందర్‌కు అందజేశారు.