హనుమకొండ, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆలిండియా సర్వీసెస్ అధికారులపై వేధింపుల విషయంలో ముఖ్యనేత దారిలోనే మంత్రులు తీరు ఉంటున్నది. మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చిన ప్రతిసారీ కనీసం రెండు వందల మందికిపైగా సరిపడా భోజనాలను జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ సమకూర్చాలి. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రైవేటు కార్యక్రమమైనా.. మంత్రి వరుసగా జిల్లాలో ఉన్నన్ని రోజులు వందల మందికి మంచి భోజన ఏర్పాట్లు చేయాల్సిందే! ఒక్కపూట అటు ఇటు అయితే ఆ కలెక్టర్, ఎస్పీ వెంటనే ట్రాన్స్ఫర్. ఇప్పటికే ఇలా ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీలను మార్చిన చరిత్ర ఓ జిల్లా మంత్రికి ఉన్నదనే చర్చ జరుగుతున్నది.
గోదావరి నదిలోని ఇసుక దందా అంతా రాష్ట్రంలోని ఓ మంత్రి అండదండలతోనే జరుగుతున్నదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల రాయల్టీ రాకుండా అధికార పార్టీ నేతలు ప్రతిరోజూ వందల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఇసుక రీచ్‌లపై సమీక్ష చేసినందుకు మంత్రికి కోపం వచ్చింది. వెంటనే ట్రాన్స్ఫర్. దీనికి మరో మంత్రి కూడా సహకరించారు. ఇద్దరు మంత్రులు కలిసి కలెక్టర్‌ను సాగనంపారు. సిన్సియర్‌గా పనిచేసే ఆ అధికారి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెళ్లిపోయారు.
ఆలిండియా సర్వీసెస్ ఆఫీసర్… ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్… దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ సర్వీస్. లక్షల్లో ఒక్కరు మాత్రమే సాధించే అరుదైన హోదా. చిన్నప్పటి నుంచి ఒక్కటే లక్ష్యంగా కష్టపడితేగానీ సాధించలేని ఘనత. ఇంత కష్టపడి అత్యున్నత హోదా సాధించి తెలంగాణలో పనిచేస్తున్న ఆలిండియా సర్వీసెస్ అధికారుల్లో కొందరికి ఇప్పుడు చెప్పలేని, చెప్పుకోలేని కష్టాలొచ్చాయి. ఒకప్పుడు ఆలిండియా సర్వీసెస్ అధికారులకు ఫస్ట్ చాయిస్‌గా ఉన్న తెలంగాణ ఇప్పుడు ‘వామ్మో..’ అని భయపడే పరిస్థితికి వచ్చింది. ముఖ్యనేత, మంత్రులు, అధికార పార్టీ వారి దందాలకు తలూపితేనే మనుగడ. నిబంధనలు పాటించినా, ప్రజల సొమ్మును కాపాడే ప్రయత్నం చేసినా అంతే సంగతులు.
ముఖ్యనేత, మంత్రులు చెప్పే తప్పుడు పనులు చేయలేమని చెప్పేంతలోపే సదరు అధికారుల వ్యక్తిగత ప్రతిష్ఠను కించపరిచేలా ఎజెండా తయారవుతుంది. ట్రాన్స్ఫర్ చేయడంతో ఆగకుండా వ్యక్తిగతంగా కించపరిచేలా, పనిగట్టుకుని అధికారిక మీడియాలో లీకుల స్టోరీలొస్తున్నాయి. మనసు చంపుకుని ‘ఉద్యోగం’ చేయాల్సిన పరిస్థితి. కాదంటే ఆ ఉద్యోగమూ లేకుండా చేసేలా వ్యక్తిగత దాడులు. అనుకూల మీడియాలో, సొంత సోషల్‌మీడియాలో ప్రత్యేకంగా కల్పిత స్టోరీలు వండివారుస్తున్నారు. రాష్ట్రంలో తాజా వ్యవహారంతో ఇది పరాకాష్టకు చేరింది. ముఖ్యనేత, మంత్రులు, అధికార పార్టీ అనుకూల మీడియా కలిసి ఆడిన నీచపు ఆటలో మహిళా ఐఏఎస్ అధికారులను సైతం తీవ్రంగా మానసికంగా దెబ్బతీశారు.
ఇది ఇలాగే కొనసాగితే కొత్తగా ఆలిండియా సర్వీసెస్‌కు వచ్చే వారు తెలంగాణను ఎంపిక చేసుకోలేరని, ఇప్పుడున్న వారు ఇక్కడ పనిచేయలేరనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై సీనియర్ ఐఏఎస్‌లు తీవ్రంగా మథనపడుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా ఆలిండియా సర్వీసెస్ అధికారులపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుంటాయని, కానీ, తెలంగాణలో దీనికి భిన్నంగా ప్రభుత్వంలోని ముఖ్యు ల నుంచే వేధింపులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా వేధింపులకు గురిచేయడం, వ్యక్తిత్వ హననం గతంలో ఎప్పుడూ లేదని వాపోతున్నారు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరిపాలనాపరంగా ముందుకు సాగడం సాధ్యం కాదని చెప్తున్నారు.

ఆలిండియా సర్వీసెస్ అధికారుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచీ వేధింపుల విధానాన్నే అనుసరిస్తున్నది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం బదిలీల ప్రక్రియ చేపడుతున్నది. నెలలో కనీసం రెండుసార్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వస్తున్నాయి. ఒక్కోసారి వారానికోసారి బదిలీల జీవోలు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు, విధానాల పరంగా ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా అధికారుల ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వానికి ఉండే అత్యంత ప్రాధాన్య అంశాలకు సరిపడే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతుంటారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం నిత్యం అధికారుల మార్పు ప్రాధాన్య అంశంగా ఉంటున్నది. మంత్రులను కట్టడి చేయడం లక్ష్యంగా ముఖ్యనేత అమలు చేసే వ్యూహాల్లో ప్రతిసారీ అధికారులను బలిచేస్తున్నారు. సాగునీరు, రెవెన్యూ, రవాణా, దేవాదాయ, విద్యుత్తు, వ్యవసాయం… శాఖ ఏదైనా మంత్రి, ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయం లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా నిత్యం బదిలీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం కంటే ముఖ్యనేత ఆలోచనలు, రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరించినన్ని రోజులే ఆ పోస్టులో కొనసాగుతున్నారు.
ఇలాంటి సందర్భాల్లో ఆయా శాఖల మంత్రులతో విభేదాలు మొదలవుతున్నాయి. అప్పుడు ముఖ్యనేత, మంత్రులు ‘మాట్లాడున్న’ సందర్భంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీల రూపంలో బలి అవుతున్నారు. ఏర్పడి రెండేైండ్లెనా కాంగ్రెస్ ప్రభు త్వంలో పాలనాపరంగా అయోమయం కొనసాగడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కొన్ని శాఖలకు, కొన్ని జిల్లాలకు తరచూ అధికారులు మారుతూనే ఉన్నారు. జీహెచ్ఎంసీ వంటి కీలక సంస్థకు కూడా రెండేండ్లలో ముగ్గురు కమిషనర్లు మారారంటే పరిస్థితి ఎలా ఉంటుంన్నదో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాల్లో కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలుగా పని చేసే వారిపైనా వేధింపుల విధానాన్నే అనుసరిస్తున్నది. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలు చెప్పినట్టు విన్నన్ని రోజులు పోస్టింగ్‌లో ఉంటారు. వీరిలో ఎవరికి నచ్చకపోయినా వెంటనే ముఖ్యనేత ఆఫీస్ నుంచి వేధింపుల ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఆగిన పనులను ఎమ్మెల్యేలు ప్రతిపాదించినా సరే జిల్లా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ అనుకూల మీడియాలో కథనాలు మొదలవుతాయి.
ఒక ఎమ్మెల్యే తర్వాత మరో ఎమ్మెల్యే ఈ పరంపర కొనసాగుతుంది. ఆ తర్వాత అధికారి బాగా పనిచేయడం లేదని సోషల్‌మీడియాలో ప్రత్యేక స్టోరీలు తయారవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కలెక్టర్లతోపాటు పోలీసు కమిషనర్, ఎస్పీల విషయంలోనూ ఇదే విధానం కొనసాగుతున్నది. మంత్రి జిల్లాకు వచ్చినప్పుడు అధికారిక కార్యక్రమాల ఖర్చులను ఆయా ప్రభుత్వ శాఖలు భరిస్తాయి.
ప్రైవేటు, అనధికార కార్యక్రమాలకు మంత్రుల సొంత ఇష్టం మేరకు ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పద్ధతి మారింది. మంత్రి జిల్లాలో పర్యటించినన్ని రోజులు అనధికార కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కొన్నిసార్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పంచుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు… తమ పరిధిలోని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు ఈ బాధ్యతలను బదిలీ చేస్తున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, రిజిస్ట్రేషన్, మైనింగ్, మున్సిపల్, డీపీవో, డీఆర్డీఏ, ఫారెస్టు విభాగాల వారికి ఈ ఖర్చులు అప్పగిస్తున్నారు. ఇదే అదనుగా
రాజకీయ పార్టీలు అధికారం మారిన ప్రతిసారీ ఐఏఎస్, ఐపీఎస్‌ల పరంగానూ ప్రాధాన్య, అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వారు మారడం జరుగుతుంటుంది. సచివాలయంలోని ముఖ్యకార్యదర్శలు, కమిషనర్ల పోస్టింగ్‌లపై ఒక్కో పార్టీ కొందరిని సమర్థులుగా భావించి కీలక శాఖలను అ ప్పగిస్తుంది. మిగతా అధికారుల్ని హోదా పరంగా అప్రాధాన్య పోస్టులను కేటాయిస్తుంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. కొన్నిసార్లు కొందరి తీరు నచ్చని పరిస్థితుల్లో వారిని బదిలీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంప్రదాయాలు మొదలుపెట్టింది.
నిబంధనలు ఉల్లంఘించేలా తామిచ్చే ఆదేశాలను పాటించని అధికారులను, చెప్పినట్టు వినని వారిని బదిలీలు చేస్తూ, అప్రాధాన్య పోస్టులకు మారుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. వారిని ఆదే పోస్టులో కొనసాగిస్తూనే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అధికారిక మీడియాలో కథనాలు వచ్చేలా చేస్తున్నది. టీవీలు, పేపర్ల కథనాలను ఆ తర్వాత అధికార పార్టీ సోషల్‌మీడియా వైరల్ చేస్తున్నది. చివరికి వారు ప్ర భుత్వంలో ఉన్న వారు చెప్పినట్టు వినేదాకా ఈ వేధింపులు కొనసాగుతున్నా యి.
చివరికి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసి అప్పుడు ఆ అధికారులే పోస్టుల నుం చి తమను తప్పించాలని కోరేలా చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యుల వేధింపులతో ఆలిండియా సర్వీసెస్ అధికారులు ఎక్కు వ శాతం ప్రాధాన్య శాఖల్లో పోస్టింగ్‌పై ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అనుకున్న వారు ఆయా పోస్టుల్లో ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు.
ఆలిండియా సర్వీసెస్ అధికారులపై వేధింపుల పాలసీ కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రు లు, అధికారులు కలిస్తేనే ప్రభుత్వమని… రాజకీయ వర్గం సొంత ప్రభుత్వంలోని అధికారులను వ్యక్తిగతంగా, మానసికంగా వేధించడం రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదికాదని ఆలిండియా సర్వీసెస్ అధికారులు ప్రస్తుత పరిస్థితులపై మథన పడుతున్నారు.
ఐఏఎస్ అధికారులను మానసికంగా వేధిస్తూ, వారితోనే మీడియాపై ఫిర్యాదులు చేయిస్తూ కాంగ్రెస్ ముఖ్యలు ఆడుతున్న రాజకీయ వ్యూహంలో తాము ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పరిపాలనలో కీలకమైన ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టంచేసి ఆయా లక్ష్యాల ప్రకారం పనిచేసేలా చూడాల్సిన ప్రభుత్వం వేధింపులను ప్రాధాన్యంగా పెట్టుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే రాష్ర్టానికి, ప్రజలకు మంచిదికాదని పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.