జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామానికి సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఇదీ ఒకటి. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పట్టించుకునేవారు కరువయ్యారు. పక్కనే ఉన్న చలివాగులో చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తున్నది. అంకుశాపూర్‌లో నీరు లేక సుమారు 40 ఎకరాల్లో వరి ఎండిపోయింది. సుమారు 231 ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 70 ఎకరాల్లో మక్కజొన్న వేశారు. సాగు నీరు లేక, భూములు నెర్రెలుబారాయి. గ్రామ శివారులో చలివాగుపై చెక్‌డ్యాం నిర్మించినా నీళ్లు లేకపోవడంతో ఉపయోగం లేకుండాపోయింది. వాగు పొడవునా రైతులు పూడికతీస్తూ, బోర్లు వేస్తూ నీటికోసం అన్ని భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సొంత మండలమైన కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మాచారెడ్డి మండలం ఎల్లంపేటలో బోనాత్ అరుణ తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేయగా, పంట ఎండిపోయింది. దీంతో పంటను జీవాలకు వదిలేసింది.