Congress | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చేనేత, వస్త్ర శాఖ పూర్తిగా పడకేసింది. నేతన్నల నుంచి వస్ర్తాలను సేకరించి వివిధ ప్రభుత్వ సంస్థలకు అందజేసేందుకు ఉద్దేశించిన పథకాలన్నీ నిలిచిపోయాయి. స్కూలు పిల్లల యూనిఫామ్స్ మినహా వస్ర్తాల తయారీ కోసం నేతన్నలకు ఇస్తున్న ఆర్డర్లన్నీ ఆగిపోయాయి. దీంతో అటు వస్త్ర శాఖలోని ఉద్యోగులు, ఇటు నేతన్నలకు పనిలేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత కళలు మసకబారుతున్నాయి. నేతన్నలకు చేతినిండా పని కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కారు విద్యార్థుల యూనిఫామ్స్‌తోపాటు బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ తదితర పథకాలను అమలు చేసింది. వీటితోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వస్ర్తాలు, కిందిస్థాయి ఉద్యోగుల యూనిఫామ్స్ కోసం బట్టలను నేతన్నల ద్వారా తయారు చేయించేవారు.
ప్రతి ఏటా రూ. 600కోట్ల వరకూ విలువైన బట్టల తయారీకి నేతన్నలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చేది. ఫలితంగా రాష్ట్రంలోని సుమారు 35 వేల పైచిలుకు నేతన్నలకు ప్రతినెలా రూ. 15000లకు తగ్గకుండా ఆదాయం లభించేది. ముఖ్యంగా సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లోని నేతన్నలు ఎక్కువగా ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్డర్లపై ఆధారపడి వస్ర్తాలు తయారు చేసేవారు. దాదాపు పదేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిన వీరి జీవనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రమాదంలో పడింది. కేవలం స్కూలు యూనిఫామ్స్ మినహా ఇతర ఆర్డర్లేవీ వారికి ఇవ్వలేదు. పాఠశాలలు తెరుచుకునే సమయం పూర్తికావడంతో ఇప్పుడు నేతన్నలంతా పనిలేకుండా ఖాళీ అయ్యారు. టెక్స్టైల్ శాఖలో కార్యకలాపాలు ఏమీ లేకపోవడంతో అక్కడి ఉద్యోగులకు కూడా పనిలేకుండాపోయింది.
చేనేత కళలకు విఘాతం
రాష్ట్రంలోని చేనేత చీరలకు దేశవ్యాప్తంగా పేరుంది. వివిధ రకాల డిజైన్లను తయారు చేయడంలో మన నేతన్నలు నైపుణ్యం సాధించారు. ముఖ్యంగా పోచంపల్లి చేనేత వస్ర్తాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక్కడ తయారయ్యే ఇక్కత్ ఫ్యాబ్రిక్‌తో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ద్వారా బెస్ట్ టూరిజం విలేజ్‌గా పొచంపల్లికి ఖ్యాతి దక్కింది. జరీ అంచులతో చీరల తయారీకిగాను గద్వాల చీరలకు, వినూత్న టెంపుల్ బార్డర్లతో చీరల తయారీకిగాను నారాయణపేట చీరలు, గొల్లభామ చీరలు ఎంతగానో ప్రఖ్యాతిగాంచాయి. ఈ కళలకు భవిష్యత్తు తరాలకు అందించాలన్నసంకల్పంతో కేసీఆర్ గడచిన పదేండ్లపాటు చేనేత రంగానికి ఎంతగానో సహకారం అందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళలు మసకబారుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు
రాష్ట్రంలో నేతన్నల వివరాలు..