హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): నగరంలో ఇసుకకు కొరత ఏర్పడకుండా ఔటర్ రింగురోడ్డుకు నలువైపులా నాలుగు ఇసుక స్టాక్యార్డ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) నిర్ణయించింది. అబ్దుల్లాపూర్‌మెట్, సంగారెడ్డి, మేడ్చల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో ప్రాంతాలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఔటర్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినట్టు వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి తదితర జిల్లాల పరిధిలో 100కుపైగా ఇసుక రీచ్‌లు ఉన్నప్పటికీ ఎన్జీటీలో కేసులు, ఇతరత్రా కారణాలతో చాలావరకు రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరగడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు, ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు నుంచి ఫైన్ ఇసుక వస్తున్నదని అధికారులు తెలిపారు. ఇసుక ధరలు స్థిరంగా ఉంచేవిధంగా ఇసుకను సిద్ధంగా ఉంచినట్టు వారు చెప్పారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద ఇసుక మేటలను తొలగించేందుకు టీజీఎండీసీ ఏర్పాట్లు చేస్తున్నది. మేడిగడ్డ వద్ద 92లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. ఇసుక తవ్వకానికి ఈ ప్రాంతాన్ని 14బ్లాకులుగా విభజించారు. ఈ నెలాఖరు వరకు టెండర్లకు గడువు ఉందని, గడువు పూర్తయ్యాక కాంట్రాక్టర్లను ఖరారుచేసి ఇసుక తవ్వకాలు చేపడతామని అధికారులు తెలిపారు. మేడిగడ్డ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక అవసరాలకు తగ్గట్టు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద కూడా ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.