హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో పాలన పడకేసిందని ఉద్యోగసంఘాల నేతలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖలో తలెత్తుతున్న వరుస వివాదాలు కార్యకలాపాలకు ఆటంకంగా మారుతున్నాయని తెలుస్తున్నది. వ్యవసాయ విస్తరణ అధికారులపై ఆశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు కొత్త పంచాయితీకి తెరతీశాయి. కొత్త పట్టాదార్ రైతులకు రైతు భరోసా జమ కాకపోవడానికి ఏఈవోలే కారణమని రఘునందన్‌రావు అన్నట్టుగా ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. పాత పట్టాదార్ పుస్తకాలతో ఏఈవోలు తమ బంధువుల బ్యాంక్ ఖాతా నెంబర్లు నమోదు చేయించారని, ఆ నిధులను దారి మళ్లించారని ఆ కథనంలో ఉంది. ఈ ఆరోపణలను నిరసిస్తూ ఏఈవోలు ఆందోళనబాట పట్టారు.
వ్యవసాయశాఖ కార్యదర్శి చేసిన ఆరోపణలపై ఏఈవోలంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు వనపర్తి, జగిత్యాల జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పథకాలను రైతులకు చేరవేసేందుకు తాము శ్రమిస్తుంటే ప్రభుత్వం తమకు ఇచ్చే బహుమానం ఆరోపణలా అని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై నమ్మకం లేకపోతే, కొత్త పట్టాదార్ రైతులను నేరుగా బ్యాంక్‌ల్లోనే ఎన్రోల్ చేయించవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుభరోసా నిధులు జమ చేయకపోతే రైతులకు తాము సర్దిచెప్పాల్సి వస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని, కార్యదర్శి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయశాఖ కార్యదర్శి, ఏఈవోల మధ్య వివాదాలు కొత్త కాదని తెలుస్తున్నది. కేంద్రం చేపట్టిన డిజిటల్ క్రాస్ సర్వేతో గొడవ ముదిరిందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా పనులతో సతమతమవుతున్నామని, సర్వేనూ తమతోనే చేయించడమేంటని ఏఈవోలు వ్యతిరేకించారు. ధర్నాలు కూడా చేశారు. కార్యదర్శి కావాలనే ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇదే సర్వేను ఇతర రాష్ర్టాల్లో ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం తమపై పనిభారం మోపడమేంటని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల కూడా తమ గోడు వినలేదని వాపోయారు. పాత వివాదాలను మనసులో పెట్టుకునే రఘునందరన్‌రావు తమపై అవినీతి ఆరోపణలు చేశారని చెప్తున్నారు. అధికారులు పనిని పక్కనపెట్టి పంచాయితీలపై దృష్టి పెట్టడమేంటని ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు.