హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయక, పునరావాస చర్యలను ప్రభుత్వం తీసుకున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని గుర్తుచేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన బీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదలు, వర్షాల నుంచి ప్రజలను రక్షించడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, బోట్లు, రెండు హెలికాఫ్టర్లు పనిచేశాయని వివరించారు. రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. టిపారుదల శాఖకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి రూ.25 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రోడ్ల మరమ్మతులకు రూ.1,67 8 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారని, ఆర్ అండ్ బీ రోడ్లకు ఈ నెల 15లోగా, పీఆర్ రోడ్లకు 8వ తేదీలోగా తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు.
రైతులపై రేవంత్‌కి ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా? అని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్తే నీకు వచ్చిన బాధేమిటని నిలదీశారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చింది కేసీఆరేనని గుర్తు చేశారు. వరద నష్టంపై కేంద్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సమావేశంలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, సురేశ్‌రెడ్డి, దీవకొండ దామోదర్‌రావు, పీ రాములు, వద్దిరాజు, లింగయ్యయాదవ్, ఎం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడటం మానుకోవాలని, లేకుంటే తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్తారని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు క్షమాపణ చెప్పి, తప్పుడు మాటలను వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరదలు రాగానే సీఎం కేసీఆర్ గంట గంటకు సమీక్షించారని, సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులంతా వరద ప్రాంతాల్లో పర్యటించారని, ఎంపీల బృందం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిందని చెప్పారు. ఖమ్మం మున్నేరు వాగు చుట్టూ రిటైనింగ్వాల్తో కూడిన ఫ్లడ్‌బ్యాంక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఒకసారైనా పార్లమెంట్లో మాట్లాడని రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టంచేశారు.