హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా చూడాలని, జన జీవనానికి ఆటంకాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు (సోమ, మంగళ, బుధవారాలు) సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నతస్థాయి అధికారులతో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటిమట్టాలు, ముంపు పరిస్థితుల గురించి ఆరా తీశారు. వివిధ శాఖల అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్లను వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
ప్రతి ఆరు గంటలకు ఒకసారి సమీక్షించాలి
సెక్రటేరియట్లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి, వర్షాలు, వరదల పరిస్థితిపై ప్రతి ఆరు గంటలకు ఒకసారి కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని వరద ముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్‌కు సూచించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లో వరద పెరిగే అవకాశం ఉన్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులు చూడాలని ఆదేశించారు. వానలు ఆగినా తద్వారా వచ్చే వరదలు మరికొన్ని రోజులపాటు కొనసాగుతాయన్న దృష్టితో కార్యాచరణ ఉండాలని స్పష్టంచేశారు.