నెక్కొండ, డిసెంబర్ 12: రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అధికారులు దిగివచ్చి విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలోని ఐవోబీ పరిధిలోని రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం, గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ గురువారం అలంకానిపేట గ్రామంలోని ఐవోబీని సందర్శించి విచారణ చేపట్టారు. అర్హులమైనా పంట రుణాలు మాఫీ కాలేదని ఆగస్టు నెలలో ఓసారి, ఈనెల 9న మరోసారి కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేశారు.
రుణంమాఫీ కాలేదని అధికార యంత్రాంగం గుర్తించి నివేదికలు పంపినా ఫలితం లేకుండాపోయింది. అలంకానిపేట ఐవోబీ పరిధిలో 1,477 మంది రైతులకు రూ.10.90 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 506 మంది రైతులకు రూ.3.69 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. వివిధ సాంకేతిక కారణాలతో 971 మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని జిల్లా వ్యవసాయాధికారి కే అనురాధ గుర్తించారు. ఈ సందర్భంగా జేడీఏ రైతులతో మాట్లాడుతూ.. అలంకానిపేట ఐవోబీ పరిధిలోని పెద్దకొర్పోలు, అలంకానిపేట, బొల్లికొండ గ్రామాలకు చెందిన వారికి రుణాలు మాఫీ కావాల్సి ఉన్నదని అన్నారు.