హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టంచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు అఖిలేశ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా బేగంపేటలోని విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. దేశ హితం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు. ఈ పోరాటంలో సీఎం కేసీఆర్ వంటి సీనియర్ నేతల అనుభవం అవసరమని, అందుకే తాను హైదరాబాద్‌కు వచ్చినట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు మధ్యాహ్నం 12.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు సీఎం కేసీఆర్ పు ష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సతరించారు. కాసేపు సేద తీరిన అనంతరం.. సీఎం కేసీఆర్ వారికి మధ్యాహ్న భోజన ఆతిథ్యం ఇచ్చారు. ఆ తరువాత ఇద్దరు దాదాపు మూడు గంటలపాటు జాతీయ రాజకీయాలతోపాటు పలు అంశాలపై చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీ ఆడుతున్న స్వార్థ రాజకీయ క్రీడ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి ఆయా పార్టీల నేతలను ఈడీ బెదిరింపులకు గురిచేస్తూ, బ్లాక్ మె యిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ ధోరణి దేశ ప్రజాస్వామిక వ్యవస్థలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఇరువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలను నిట్టనిలువునా చీలుస్తూ, తెల్లారేసరికి ప్రభుత్వాలను కూలదోస్తూ, రాజకీయ అస్థిరత్వానికి పాల్పడుతూ, ఒక అప్రజాస్వామిక వాతావరణాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ పెంచి పోషిస్తుండటం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ లేని పోరాటానికి అర్థం ఉండదు
దేశంలో అప్రజాస్వామిక వాతావరణం, రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భావసారూప్యత గల పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీగా అనూహ్యంగా ఎదుగుతూ దేశ ప్రజల ఆదరణ చూరగొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఐక్య సంఘటనలో భాగస్వామ్యం కావాలని అఖిలేశ్ ఆహ్వానించారు. ప్రజాస్వామిక పద్ధతిలో, శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో సమాంతరంగా అభివృద్ధి సాధిస్తున్న తీరు తమ వంటి ఇతర రాష్ట్రాలకు ఎంతో ఆదర్శమని స్పష్టంచేశారు. ఇంతటి దార్శనికత గల జాతీయ నేత సీఎం కేసీఆర్ లేకుండా ప్రత్యామ్న్యాయ ఐక్య సంఘటనకు అర్థమేలేదని, తమతో కలిసి ముందుకు సాగాలని ఆహ్వానించారు.
దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న బీఆర్ఎస్
‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదంతో మహారాష్ట్ర సహా దేశ ప్రజల దృష్టిని బీఆర్ఎస్ ఆకర్షిస్తున్నదని, జాతీయ పార్టీగా పరిణామం చెందిన అనతి కాలంలోనే బీఆర్ఎస్ అనూహ్యంగా ఎదిగి దేశ ప్రజాదరణ పొందడం గొప్ప విషయమని అఖిలేశ్‌యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్‌రావుకు అఖిలేశ్ అభింనదనలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా రైతు లు, ఇతర వర్గాలు ఆదరిస్తున్న తీరు గొప్పగా ఉన్నదని కొనియాడారు. దక్షిణ భారత దేశం నుంచి ఒక జాతీయ పార్టీని స్థాపించడమే కాకుండా, దేశ ప్రజల మన్ననలు అందుకోవడం గొప్ప విషయమని అభినందించారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం అఖిలేశ్ యాదవ్ తిరుగు ప్రయాణమయ్యారు. వారికి సీఎం కేసీఆర్ ఘనంగా వీడోలు పలికారు. ఈ భేటీలో మంత్రులు తలసాని, వేముల, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో ప్రాధాన్యం
సీఎం కేసీఆర్‌తో అఖిలేశ్ సమావేశం జాతీయస్థాయిలో ప్రాధాన్యం సంతరించుకొన్నది. వీరిరువురి భేటీ సాగుతున్నంత సేపు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు చర్చా కార్యక్రమాలు కొనసాగించాయి. తాము బీఆర్ఎస్తో కలవబోం అని ఆదివారం ఖమ్మం సభలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ జాతీయ మీడియా కథనాలను ప్ర సారం చేసింది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో చొచ్చుకుపోతున్న బీఆర్ఎస్పై దేశమంతా దృష్టి సారించిన నేపథ్యంలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నాయకత్వం ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న జన నేతగా సీఎం కేసీఆర్ ఆవిర్భవిస్తున్న చారిత్రక సందర్భంలో జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్రను విస్మరించే పరిస్థితి లేదనేది వారి అంచనా. ఖమ్మంలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలు అవగాహనా రాహిత్యంతోనే తప్ప, మరోటి కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే విపక్ష కూటమిలో ప్రధాన పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానంలో భాగంగానే అఖిలేశ్ యాదవ్ భేటీ అని జాతీయ మీడియాలో విశ్లేషణలు కొనసాగడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.