హైదరాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ): ప్రతిసారీ సభలో కృష్ణా, గోదావరిపైనే చర్చిస్తారా? అని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కారు సభా సంప్రదాయాలను ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. శనివారం శాసనసభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వడం మొదలుపెట్టిన వెంటనే అక్బరుద్దీన్ నిల్చొని అభ్యంతరం వ్యక్తంచేశారు.
పీపీటీ ఇచ్చేముందు సభ్యులకు నోట్ అందించాలని, ఎటువంటి నోట్ ఇవ్వకుంటే తమకు ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. ‘కనీసం ఎజెండా కూడా ఇవ్వలేదు, స్వల్పకాలిక చర్చ చేపట్టే ముందు దానికి సంబంధించిన నోట్ సభ్యులకు అందించాలి. ఆ తర్వాత సభ్యులు నోట్ చదువుకొని, పీపీటీ విన్న అనంతరం ప్రశ్నలేమైనా ఉంటే అడుగుతారు. ఇదీ సంప్రదాయం. మీరు కనీసం ఎజెండా కూడా ఇవ్వరు. నిన్న కూడా ఇలాగే జరిగింది. ఎజెండా రాత్రి ఒంటిగంటకో.. ఎప్పుడో వస్తుంది.
ఇలా అయితే ఎలా?’ అని అక్బరుద్దీన్ సభ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘సభా నిర్వహణ అధికారం మీకు ఉన్నది. ఇలానే కానిద్దామంటే మీ ఇష్టం’ అని స్పీకర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. దీనిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ, పీపీటీ సభ్యులకు కనిపిస్తుందని, అంతేగాకుండా మంత్రి దాన్ని వివరిస్తారని, ప్రత్యేకంగా నోట్ పెట్టలేదని చెప్పారు. తర్వాత దానిపై సభ్యులకు షార్ట్నోట్తోపాటు పెన్‌డ్రైవ్ కూడా అందిస్తామని మంత్రి వివరించారు.