Akbaruddin Owaisi | హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): ‘ఎజెండాలో ఉండేది ఒకటి.. చర్చించేది మరొకటి. ఎజెండాలోని అంశాల ఆధారంగా చర్చకు మేము సిద్ధమైతే.. తీరా ఇక్కడికొచ్చాక కొత్త అంశం తెరపైకి వస్తుంది. సిద్ధంకాకుండా ఎలా మాట్లాడాలి. సభ ఎన్నిరోజులు నడుపుతారో బీఏసీలోనూ చెప్పరు. సభలో ఏమి జరుగుతున్నదో అర్థం కావడం లేదు. సభని నడపలేనివారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు?’ అని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శాసనసభ నిర్వహణపై గురువారం ఒవైసీ అధికారపక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం శాసనసభ సమావేశంకాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర రుణాలపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ఆయన మాట్లాడుతుండగా అక్బరుద్దీన్ జోక్యం చేసుకున్నారు. ఎజెండాలో పేర్కొన్న ప్రకారం బిల్లులపై చర్చించాల్సి ఉన్నదని, అవి పూర్తయ్యాక రుణాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని సూచించారు. తాము బిల్లులపై మాట్లాడేందుకు సిద్ధమై వస్తే ఇప్పుడు రుణాలపై చర్చ చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశం చేపడుతున్నట్టు తమకు ముందుగా సమాచారం ఎందుకివ్వలేదని నిలదీశారు. సభలో ఏ అంశాన్నైనా చేపట్టేందుకు అనుమతించే అధికారం స్పీకర్‌కు ఉన్నప్పటికీ ఫ్లోర్ లీడర్లకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత శాసనసభా వ్యవహారాల మంత్రితోపాటు విప్, సభా కార్యదర్శిపై ఉన్నదని చెప్పారు.
అసలు సభను ఎన్నిరోజులు నడుపుతారో కూడా ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఒకవేళ ఎజెండాలో ఏమైనా మార్పులు జరిగితే ఆ సమాచారం ఫ్లోర్ లీడర్లకు ఇవ్వాల్సి ఉంటుందని, తాము అడుగుతున్నా కార్యదర్శి నుంచి కూడా సరైన సమాధానం రావడంలేదని వాపోయారు. రుణాలపై ఇప్పటికే 8 సార్లు సభలో చర్చించారు. ఇంకా ఎన్నిసార్లు దీనిపై చర్చిస్తారని ప్రశ్నించారు. ఒకవేళ ఎజెండాలో లేని అంశాన్ని చేపట్టాల్సి వస్తే సభలో స్పీకర్‌ను అనుమతి కోరడం, స్పీకర్ దానికి అనుమతించడం సంప్రదాయమని, అటువంటిది ఏమీ లేకుండా ఇష్టమొచ్చిన అంశంపై చర్చ చేపట్టడం, ఎవరైనా ప్రశ్నిస్తే, స్పీకర్ అనుమతితోనే చేపట్టినట్టు చెప్పడమేమిటని నిలదీశారు. ఏదైనా అంశాన్ని చేపట్టాల్సి వచ్చినప్పుడు అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు.
‘ఎజెండా ప్రకారం బిల్లులపై చర్చించాలి. తీరా ఇక్కడికి వచ్చాక రుణాలపై చర్చ ప్రారంభించారు. ఇదేనా సభ నడిపే పద్ధతి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. సభలో ఏ అంశాన్ని చేపడుతున్నారని తాము కార్యదర్శిని అడిగితే ఆయన కూడా తమకు సమాధానం చెప్పడం లేదని తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత శాసనసభా కార్యదర్శిపై ఉన్నదని, గతంలో తాము ఫ్లోర్ లీడర్లకు ముందస్తు సమాచారం ఇచ్చేవాళ్లమని గుర్తుచేశారు. ఎజెండాను పాటించకపోవడం సభాసంప్రదాయాలను ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. బీజేపీ పక్ష నాయకుడు మహేశ్వర్‌రెడ్డి సైతం సభ నిర్వహణపై అసహనం వ్యక్తంచేశారు. ఎజెండా ప్రకారం సభను నడపాలని కోరారు.
రుణాలపై చర్చ ముఖ్యమైందని భావించినందునే దానిపై చర్చ చేపట్టామని, అప్పుడప్పుడూ అలా జరుగుతుంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు. హరీశ్‌రావు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చినందునే ఈ అంశాన్ని చేపట్టాలని నిర్ణయించి, స్పీకర్ అనుమతితోనే చేపట్టినట్టు పేర్కొన్నారు.