హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం మధ్యలో విద్యాలయాల అక్రమ భవనాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఇచ్చిన వార్నింగ్‌తోనే హైడ్రా తోకముడిచిందని సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. నగరంలో కూల్చివేతలతో హైడ్రా చేసిన హడావిడి అంతా హైడ్రామా అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. హైడ్రాకు దమ్ముంటే ఓవైసీ సోదరులు సల్కం చెరువులో నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థల భవనాలను కూల్చాలని సోషల్ మీడియా, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, మీడియా గొంతెత్తింది.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎం పార్టీ నేతల భవనాలను కూల్చేస్తారా? లేదా?అంటూ రెండు మూడు రోజులుగా సోషల్‌మీడియాలో ట్రెడింగ్ అయింది. అక్బరుద్దీన్ తనపై కాల్పులు జరిపినా ఒప్పుకుంటా కానీ విద్యాసంస్థలను ముట్టుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ కూల్చితే 40వేల మంది విద్యార్థులు ప్రభుత్వంపై తిరగబడుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నగరవాసుల్లో వ్యక్తమైంది. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా హైడ్రా విద్యాసంవత్సరం మధ్యలో ఆ భవనాలను ముట్టుకోబోమని ప్రకటించింది. అక్బర్ద్దీన్ పవర్‌పుల్ వార్నింగ్‌కు ప్రభుత్వం వణికిపోతూ వెనుకడుగు వేసిందనే చర్చ మొదలైంది.
విద్యార్థులు నష్టపోవద్దనే !
విద్యార్థులు నష్టపోవద్దనే విద్యాసంవత్సరం పూర్తయిన తరువాతనే చర్యలకు ఉపక్రమిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులపై ఆయా శాఖలు సంబంధిత స్థలాలకు వెళ్లి పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఒక సల్కం చెరువుకే కాకుండా విద్యాసంస్థలకు సంబంధించి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి విషయంలో ఇదే విధానం కొనసాగిస్తామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాలలో భవనాలు నిర్మించిన యజమాన్యాలు స్వచ్ఛందంగా కూల్చివేయాలని సూచించారు.