హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్రెడ్డి ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి ఆయా కళాశాలలను సీజ్ చేయాలని, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లను నివారించాలని డిమాండ్ చేశారు.