ఖమ్మం కమాన్‌బజార్, జూలై 6 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర వీధుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థి లోకం కదం తొక్కింది. కేయూ అనుబంధ పీజీ కళాశాల నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకొని ఈడ్చుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొన్నది. పూర్తి రీయింబర్స్మెంట్ అందించాలని జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ డిమాండ్ చేశారు.
ముషీరాబాద్, జూలై 6: దశలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. పథకం అమలులో పాత విధానాన్నే కొనసాగించాలనే డిమాండ్‌తో ఈ నెల 8న ర్యాలీలు, ధర్నాలు, 14న సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తూ, పెండింగ్‌లో ఉన్న రూ. 8 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 14 లక్షల మంది విద్యార్థులు ఫీజులు, ఉపకార వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.