హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రమాదకర పురుగు మందులపై సంపూర్ణ నిషేధం విధించి రైతులను రక్షించాలని తెలంగాణ రైతు సంఘం(ఏఐకేఎస్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడారు. పంటలను రక్షించుకునే క్రమంలో రైతులు వాడుతున్న విషపూరిత పురుగు మందులు అన్నదాతలతోపాటు వారి కుటుంబ సభ్యులు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు అనేక అధ్యయనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
విషపూరిత పురుగు మందులతో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, శ్వాసకోశ వ్యాధులు, నాడీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులు, వ్యవసాయ కూలీల ఆరోగ్యంపై పెస్టిసైడ్ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక వైద్యకమిషన్ ఏర్పాటు చేయాలని పోతినేని సుదర్శన్రావు, తీగల సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.