G. Niranjan | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కుక్కుల దాడుల్లో చిన్నారు లు, వృద్ధులు చనిపోతున్నారని ఏఐసీసీ సభ్యుడు జీ నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇటువంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తు న్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ శనివారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు లేఖ రాశారు.
శునకాల దాడిలో మూడు వారాల క్రితం నాలుగేండ్ల బాలుడు చనిపోయాడని, వరంగల్ ఎంజీఎంలో అప్పుడే పుట్టిన శిశువుపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయని లేఖలో గుర్తు చేశారు. ఈ వరుస ఘటనలపై స్పందించిన హైకోర్టు దీనిని సుమోటోగా తీసుకుని శునకాల బారి నుంచి రాష్ర్టాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో కుక్కలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా వాటిని నియంత్రించడంలో అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కల బెడదను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి శునకాలను ఏరిపారేయాలని సూచించారు. కుక్కల దాడిలో మరణించిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నిరంజన్ డిమాండ్ చేశారు.