హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్టుల్లో పులులు, వన్యప్రాణుల వేట, అక్రమ కలప స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు అటవీశాఖ తెలిపింది. ఒకప్పుడు అడవుల్లో జరిగే అక్రమ వేట, చెట్ల నరికివేతలను గుర్తించడం అటవీశాఖకు పెద్ద సవాల్‌గా ఉండేది. ఇప్పుడు ఏఐ ఆధారిత థర్మల్ కెమెరాలు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ల సాయంతో అడవిపై 24 గంటల నిఘా సాధ్యమవుతున్నదని అధికారులు పేర్కొన్నారు.
కెమెరాట్రాప్‌లు, పీజీఎస్ ఆధారిత ఎంస్ట్రైప్స్ మొబైల్ యాప్, డ్రోన్ పర్యవేక్షణ, డిజిటల్ డేటా విశ్లేషణ ద్వారా వేట, అడవి ఆక్రమణలు, వన్యప్రాణులపై ముప్పు, పులుల సంచార మార్గాలను వన్యప్రాణి పరిరక్షణ విభాగం అధికారులు సులువుగా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ అడవుల జీవవైవిధ్య పరిరక్షణకు అరణ్యభవన్ కేంద్రంగా ఏర్పాటైన టైగర్ సెల్‌కు జూన్ వరకు 1,543 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.