హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు. విద్యార్థుల్లో మరింత మెరుగైన అభ్యాస పద్ధతులను, సాంకేతిక ప్రమాణాలను పెంపొందించడానికి ఎక్‌స్టెప్-ఫౌండేషన్ సేవలు వినియోగించుకోనున్నట్టు పేర్కొన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్‌స్టెప్-ఫౌండేషన్‌ను తన నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సందర్శించినట్టు ప్రకటనలో వెల్లడించారు.
ప్రతినిధి బృందంలో ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులు ఉన్నట్టు తెలిపారు. విద్యారంగంలో చేపట్టాల్సిన పలు ఇన్షియేటివ్లపై చర్చించినట్టు ఆమె వివరించారు. విజనరీ టెక్నోక్రాట్, ఫిలాంత్రపిస్ట్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయిన నందన్ నీలేకని ఎక్‌స్టెప్-ఫౌండేషన్‌కు కో-ఫౌండర్‌గా ఉన్నారని పేర్కొన్నారు.