హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులపై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న విచారణకు హైకోర్టు శుక్రవారం ముగింపు పలికింది. ఆ కేసులను ఏలూరు (ఆంధ్రప్రదేశ్) కోర్టుకు బదిలీ చేసింది. హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉన్నదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.50 కోట్ల సొమ్మును కూడా ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. గతంలో తాము వెలువరించిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని డిపాజిటర్లు, బ్యాంకులు దాఖలుచేసిన కేసులను పరిషరించాలని ఏలూరు కోర్టుకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణలో ఉన్న పిటిషన్లపై విచారణ ముగిస్తూ తుది ఉత్తర్వులు వెలువరించింది.