అక్కడ చిట్టి చేతులు నాగలి పట్టి భూమి దున్నుతాయి! పార పట్టి పొలానికి నీరు పెడతాయి! కంపోస్టు ఎరువులు తయారు చేసి పంటకు దన్నునివ్వటమేకాదు.. పురుగు పుట్ర సోకకుండా క్రిమిసంహారకాలు చల్లి పంటను కాపాడుతాయి! పెంపుడు జంతువులతో ఆడుతూ వాటిని లాలిస్తాయి! ఇదేమీ ఒక తాత పొలంలో మనవళ్లు చేస్తున్న సరదా పని కాదు! పిల్లలకు సైతం రైతు కష్టం, వ్యవసాయం చేసే విధానంపై అవగాహన కల్పించేందుకు ఓ కంప్యూటర్ ఇంజినీరు ప్రారంభించిన యాక్టివ్ ఫాం స్కూల్.. తెలుగులో చెప్పాలంటే.. ‘పొలం బడి’!
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రైతు రెక్కల కష్టంతోనే మన కడుపు నిండుతుంది. సినిమాల్లో పంట పొలాల్లో రైతులు సంతోషంగా గడిపే సన్నివేశాలు తప్ప.. నిజజీవితంలో వారు పడే కష్టం గురించి పిల్లలకు తెలియదనే చెప్పాలి. నేటి తరం విద్యార్థులకు ఆ కష్టాన్ని అర్థమయ్యేలా చెప్పటం పెద్ద పనే! పాఠశాల స్థాయిలోనే పిల్లలకు ఆహారాన్ని ఎలా పండించాలో నేర్పించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు. కానీ సంప్రదాయ పాఠశాలల్లో విద్యార్థికి వ్యవసాయం నేర్పటం సాధ్యమయ్యేదేనా! పుస్తకాలు చూసి పాఠం చెప్తే విద్యార్థులు అర్థం చేసుకుంటారా? ఈ సమస్యకు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిష్కారం చూపారు. కంప్యూటర్ నెట్వర్కింగ్ మీద పనిచేసే వంశీ ఆ వృత్తిని వదిలి, ‘యాక్టివ్ ఫామ్ స్కూల్’ను స్థాపించి వేలమంది విద్యార్థులకు వ్యవసాయం నేర్పిస్తున్నారు.
ఎలా వచ్చిందీ ఆలోచన?
మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మం డలం, గర్లపాడుకు చెందిన వంశీకి చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై ఆసక్తి. ఐటీ సెక్టార్లో మంచి ఉద్యోగంలో స్థిరపడిన ఆయన 2012 లో వ్యవసాయంలోనే కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. స్కూలు పిల్లలకు ప్రాక్టికల్‌గా వ్యవసాయ పాఠాలు చెప్పేందుకు 2013 అక్టోబర్‌లో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ)లో మూడెకరాల స్థలం లీజుకు తీసుకొని ఫామ్ స్కూల్‌ను ప్రారంభించారు. తొలి ఏడాదే 7 వేల మంది విద్యార్థులు ఫామ్ స్కూల్‌ను సందర్శించారు. రెండేండ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామంలో 25 ఎకరాలతో ఫామ్ స్కూల్ క్యాంపస్‌ను విస్తరించారు. గత 8 ఏండ్లలో 350 పాఠశాలలకు చెందిన 85 వేల మంది విద్యార్థులు యాక్టివ్ ఫామ్ స్కూల్లో వ్యవసాయం నేర్చుకొన్నారు.
ఏంటీ ప్రత్యేకత?
ఈ స్కూల్లో విద్యార్థులతోనే వ్యవసాయం చేయిస్తారు. భూమి దున్నడం, విత్తనాలు వేయ డం, వర్మీ కంపోస్టు తయారీ లాంటి వ్యవసాయంలోని ప్రతి దశనూ పిల్లలతోనే చేయిస్తారు. చిన్న పిల్లల కోసం 12 రకాల పెంపుడు జంతువుల (పుస్తకాల్లో ఉన్నవి)ను ఇక్కడ నేరుగా చూపిస్తారు. 8-17 ఏండ్ల విద్యార్థులకు ముందు క్రాప్ఫీల్డ్ సందర్శనలో 55 రకాల పంటలను చూపిస్తారు. పిల్లలకు నచ్చిన పంటను ఎంచుకొని సాగు చేయడం ఎలాగో నేర్చుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక కోర్సులు, క్యాంపులను ఆఫర్ చేస్తున్నారు. సందర్శనకు వచ్చే పిల్లలకు రైతులతో ప్రాక్టికల్స్ ఇప్పిస్తారు.
కోర్సులు..
సర్టిఫైడ్ జూనియర్ ఫార్మర్ కోర్సులో ఒక రోజు పూర్తి అవగాహన కార్యక్రమం ఉంటుంది. అది అయిపోయాక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. స్కూ ల్లో చెప్పిన పంటను, మొక్కలను ఇంటివద్ద పెంచి ప్రతివారం దానికి సంబంధించిన ఫొ టోలు పంపించాలి. రెండో కోర్సు సర్టిఫైడ్ అర్బన్ ఫార్మర్. ఇందులో టెర్రస్ ఫార్మింగ్‌పై శిక్షణ ఉంటుంది. కంపోస్టు ఎరువు తయారీ, టెర్రస్ ఫార్మింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేర్పుతారు. మూడోది సర్టిఫైడ్ నేచురల్ ఫార్మర్. ఇందులో వ్యవసాయం చేయడం నేర్పిస్తారు.
చాలా నేర్చుకున్నా
నేను సర్టిఫైడ్ జూనియర్ ఫార్మర్ ప్రోగ్రామ్‌లో ఆలుగడ్డలు సాగుచేశాను. పంటకు ఎరువులను నేనే తయారు చేసుకున్నా. స్వయంగా పంట సాగు చేయడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
– రాగ్రత్రెడ్డి, విద్యార్థి
రైతుల కష్టం తెలిసింది
పంట పండించేందుకు రైతులు ఎంత కష్టపడుతారో ఫామ్ స్కూల్లో తెలిసింది. మనం తినే ఆహారం ఎంత విలువైందో అర్థమైంది. నేను స్వయంగా వ్యవసాయం చేయడం కొత్త అనుభూతినిచ్చింది.
– సాయి అక్షర, విద్యార్థి