శ్రీనగర్ : పేసర్లు ముకేశ్ కుమార్ (6/33), ఆకాశ్ దీప్ (3/25) ఖతర్నాక్ బౌలింగ్‌తో విరుచుకుపడటంతో రంజీ ట్రోఫీ చాంపియన్ జమ్మూ కాశ్మీర్‌ను చిత్తు చేసిన రెస్టాఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ పోరులో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని రెస్ట్ టీమ్ 167 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 279 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ.. రెస్ట్ బౌలర్ల దెబ్బకు 111 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్లు శుభమ్ ఖజూరియా (36), ఖమ్రాన్ ఇక్బాల్ (32) తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇవ్వగా లంచ్ సమయానికి 89/3తో కాస్త మెరుగ్గానే నిలిచిన జమ్మూను రెండో సెషన్లో ముకేశ్, ఆకాశ్ దెబ్బకొట్టారు. 22 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను పడగొట్టారు. జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. స్మరణ్ రవిచంద్రన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.