హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న రైతు ప్రయోజన కార్యక్రమాలతో అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం పురోగమిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, ప్రభుత్వ విధానాలు రైతులకు మరింత చేరువ చేయడం తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖలు, వర్శిటీలు, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌లో తెలంగాణ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించామని, ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు, పరిశోధనకు సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే తెలంగాణ కంది పంట అభివృద్ధికై తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో తెలంగాణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలన్నారు.
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా గతంలో కేసీఆర్ చెప్పినట్లుగా పంటకాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ, ఇతర కూరగాయల సాగుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. హైదరాబాద్ చుట్టూనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, కార్పోరేషన్ల పరిధిలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో నారు మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యతను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఖమ్మంలో ఉన్న అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా ఖమ్మం జిల్లా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణకు ఆదేశాలు జారీ చేశారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు అయిల్ ఫెడ్‌కు ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేటలో 60 ఎకరాలలో, మహబూబాబాద్‌లో 84 ఎకరాలలో ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. నాలుగేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలన్న లక్ష్యంలో భాగంగా వివిధ జిల్లాలలో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు ఇదివరకే ప్రారంభించామన్నారు.
రాబోయే వానాకాలంలో లక్షల ఎకరాలలో నాటేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు తెలంగాణ ప్రాంత నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తేల్చారన్నారు. ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల ఆలుగడ్డ తెలంగాణలో వినియోగిస్తుండగా.. కేవలం 5వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఇక్కడ ఉత్పత్తి లేకపోవడంతో వెయ్యికోట్ల ధనం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి వెచ్చించాల్సి వస్తుందన్నారు. రైతులకు ఉన్న ఆలుగడ్డ విత్తన సమస్యను, విత్తన నిల్వకు అవసరమైన వసతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కోహెడ మార్కెట్లోని పది ఎకరాలను కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌కు అప్పగించాలని నిర్ణయించి, నిర్మాణానికి ఆదేశాలు జారీ
చేశారు. దీని ద్వారా ఆలుగడ్డతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవకాశం ఉంటుందన్నారు.
రైతు వేదికలను మరింత ఆధునీకరించి సాగుకు అవసరమైన సమాచారం రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వ్యవసాయంలో మరింత ఎక్కువగా వాడుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. తెలంగాణ సోన వరి, మహబూబాబాద్, ఖమ్మం మిరప, తాండూరు కంది, పాలమూరు వేరుశెనగ, నిజామాబాద్ పసుపు, తెలంగాణ పత్తి, జగిత్యాల, కొల్లాపూర్ మామిడి ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రైవేటు కంపెనీలతో పోటీపడేలా ఎదగాలన్నారు.
పత్తి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రైతాంగం.. 60లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సాగు అనుకూల విధానాల ద్వారా 2014 నాటికి రూ.1.31కోట్ల ఎకరాల్లో ఉన్న పంటల సాగు.. 2021 నాటికి 2.03కోట్ల ఎకరాల విస్తీర్ణానికి పెరిగిందని, 45లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చే వరి ధాన్యం నేడు మూడు కోట్ల టన్నులకు పెరగడం తెలంగాణ సాధించిన ఘన విజయమన్నారు. జాతీయ వృద్ధి రేటు 8.5శాతం కాగా.. తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 15.8శాతమన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, వీసీలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, వివిధ సంస్థల చైర్మన్లు కొండూరి రవీందర్ రావు, మార గంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సాయిచంద్, కొండబాల కోటేశ్వర్ రావు, ఉన్నతాధికారులు లక్ష్మీభాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.