కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకుడెవరూ ప్రజలకు కనిపించడం లేదని, మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా పోయిందని అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన పనుల్లో ఒక్కటైనా చేయగలమని చెప్పే దమ్ము వారికి లేదన్నారు. పాదయాత్రలు, సభల పేరుతో సీఎం కేసీఆర్‌ను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారు తప్ప రాష్ర్టానికి, ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పడం లేదని మండిపడ్డారు. రైతుల కష్టంతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నదని స్పష్టం చేశారు.
రాష్ట్రం ఆవిర్భవించిన 2014 యాసంగిలో అన్ని పంటలు కలిపి 28.18 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ యాసంగిలో 68.08 లక్షల ఎకరాలకు విస్తరించిందని అన్నారు. ఆల్‌టైం రికార్డు సాధించిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ రంగానికి రూ.3.50 లక్షల కోట్లు ఖర్చుచేశామని, తెలంగాణ కంటే ఐదారింతలు పెద్ద రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఇక్కడ కేటాయించిన బడ్జెట్లో పావువంతు కూడా కేటాయించ లేదని తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రి గంగుల, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.