హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రైతాంగంతో గోక్కున్నోడు బాగుపడిన చరిత్ర లేదని, రైతుల ఉసురు పోసుకోకుం డా బియ్యాన్ని కేంద్రమే సేకరించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేం ద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, తన విధానాన్ని పునః సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. వరి పంట విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఒకరకంగా, రాష్ట్ర నేతలు మరో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర నాయకులను అదుపు చేసుకోవాలని జాతీయ నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే నిర్దారించిందని చెప్పారు. దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు ఆహారభద్రత లేదని, పేరుకుపోయిన ఆహార నిల్వలను పేదలకు పంచిపెట్టాలని సూచించారు. సుప్రీంకోర్టు జోక్యంతో నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం తాత్కాలికంగా పక్కన పెట్టినప్పటికీ, అవి రైతుల మెడపై వేలాడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.
ఏడేండ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ మంత్రి, ఎంపీలు రాష్ర్టానికి ఒక్క మేలైనా చేసి పెట్టారా? అని నిలదీశారు.చిల్లర మాటలు మాని, యాసంగి కొనుగోళ్లపై కేంద్రం నుంచి ఉత్తర్వులు తేవాలని సవాలు చేశారు. కేంద్రం రాష్ర్టానికి మెడికల్ కాలేజీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, ట్రిబ్యునల్ ఏర్పాటులో అలసత్వం వహిస్తున్నదని విమర్శించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. వానకాలం ధాన్యం కోసం అవసరమైనన్నీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాకు హాజరైన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. నిపుణులతో చర్చించి కేంద్రమే పంటల మార్పిడిపై విధానం ప్రకటించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో గతంలోనే దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలని సూచించారని గుర్తుచేశారు.
అధికారులు మనసు పెట్టి పనిచేస్తే, రైతులను ఇతర పంటల వైపు మళ్లించడం అసాధ్యమేమీ కాదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంటల మార్పిడి ద్వారా వ్యవసాయ రంగం లో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. పప్పులు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలకు మారెట్లో డిమాండ్ ఉన్నదన్న విషయాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రస్థాయి బృందాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వరి మళ్లలో మినుములు, పెసర్లు వేయడం వల్ల వానకాలం సాగులో ఎరువుల వాడకం తగ్గించవచ్చునని పేర్కొన్నారు. కుసుమలు, ఆముదాల సాగు తిరిగి చేపట్టేలా రైతుల్లో అవగాహన పెంచాలని కోరారు. ఈ సందర్భంగా పంటలమార్పిడి, వైవిధ్యీకరణపై లఘుదీపిక, గోడపత్రిక, రైతువేదికల వ్యా సదీపికలను విడుదల చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు పాల్గొన్నారు.