Telangana | హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు చెప్తున్న మాట. కానీ, వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించిన అధికారిక గణాంకాలు మరో విధంగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన ముందస్తు అంచనా నివేదిక ప్రకారం.. గత వానకాలంతో పోల్చితే ఈ ఏడాది వానకాలంలో వరి సాగు విస్తీర్ణం 0.41% తగ్గినట్టు వెల్లడైంది. ధాన్యం ఉత్పత్తి 54 వేల టన్నులు, బియ్యం ఉత్పత్తి కూడా 5.12% తగ్గినట్టు తెలిపింది.
2023-24 వానకాలంలో 26.68 లక్షల హెక్టార్లు (65.89 లక్షల ఎకరాలు)లో వరి సాగు కాగా, ఈ ఏడాది (2024-25) వానకాలంలో 26.57 లక్షల హెక్టార్లు (65.62 లక్షల ఎకరాలు)లో వరి సాగైనట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. నిరుడు వానకాలంలో 1,44,85,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఈ ఏడాది వానకాలంలో 1,44,31,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు తెలిపింది. ఈ లెక్కన గత సంవత్సరం కంటే వరి సాగు విస్తీర్ణం 27 వేల ఎకరాలు, ధాన్యం ఉత్పత్తి 54 వేల టన్నులు తగ్గింది. అంతేకాదు, గత ఏడాదితో పోల్చితే పత్తి సాగు కూడా 1.98% తగ్గినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించడం గమనార్హం. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రు లు మాత్రం గొప్పలకు పోయి రికార్డు స్థాయి లో ధాన్యం ఉత్పత్తి అయినట్టు తప్పుడు ప్రకటనలు చేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
కాళేశ్వరం నీళ్లు లేకున్నా గత సంవత్సరంతో పోల్చితే రికార్డు స్థాయిలో 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇది తెలంగాణ చరిత్రలోనే అత్యధికమని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు చెప్తున్నారు. గత ఏడాది వానకాలం సాగు సమయంలో బీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలో ఉండగా, ఇప్పుడు కాం గ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ సారి అధిక ధాన్యం ఉత్పత్తి అయినట్టు ప్రచా రం చేయడం ద్వారా గత బీఆర్ఎస్ సర్కారు వైఫల్యం చెందిందని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని ప్రభుత్వ పెద్దలు భావించినట్టు స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలోనే వరి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి తగ్గినా వివిధ సభల్లో తప్పుడు లెక్కలు చెప్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖ తాజా గణాంకాల నేపథ్యంలో సీఎం, మంత్రులు ఏం సమాధా నం చెప్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వరి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి పెరిగిందంటూ ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఏం చేసిందని సాగు విస్తీర్నం పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ వానకాలం రైతుభరోసాను ఎగ్గొట్టిన విషయం మర్చిపోయారా? అని నిలదీస్తున్నారు. రైతుబంధు అందక, పెట్టుబడికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత గోస పడ్డమో మీకేం తెలుసని మండిపడుతున్నారు. రుణమాఫీ అందరికీ చేయలేదు. సకాలంలో ఎరువులు కూడా ఇయ్యలేకపోతిరి.. ఇక సాగు, ఉత్పత్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నలు సంధిస్తున్నారు.