హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ) : రైతుల నుంచి మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 320 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పంట ముందుగా చేతికొచ్చే జిల్లాల్లో తొలుత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యాసంగిలో రికార్డు స్థాయిలో 8.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా, మొత్తం 23 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో తొలి దశలో 12 లక్షల టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరమైతే మరింత కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.