Budget | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ శాఖ బడ్జెట్‌పై జరుపుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మొత్తం రూ.64వేల కోట్ల నిధులకు సంబంధించిన ప్రతిపాదనను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ, రైతుభరోసా పథకాలకే 54వేల కోట్లు, పంటల బీమాకు రూ. 3వేల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. రైతుబీమాకు రూ.1500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. కేంద్ర బడ్జెట్ తర్వాత ఆగస్టులో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను రేవంత్ సర్కారు ప్రవేశపెట్టనుంది.
‘క్యాచ్ ది ట్రాప్’ డ్రైవ్‌తో సత్ఫలితాలు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల రక్షణతోపాటు అక్రమ వేటను నిరోధించేందుకు రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ‘క్యాచ్ ది ట్రాప్’ డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తున్నది. ‘క్యాచ్ ది ట్రాప్’ డ్రైవ్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అటవీ సిబ్బంది 3,810 ఉచ్చులు, వలలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 3,080 వలలు, ఉచ్చులను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన 730 వలలు, ఉచ్చులను తరలించాల్సి ఉన్నది.వన్యప్రాణులను చంపేందుకు అడవుల్లో వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి రెండేండ్లలో ఆరుగురు మృతి చెందారు.
వారిలో గ్రేహౌండ్స్ కమాండో ప్రవీణ్,రాజన్న-సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన గుగులోత్ మంగ్యా నాయక్ (45), ఆరేపల్లి (వీ) భీమారం మండలం మంచిర్యాలకు చెందిన రాజన్న (45), ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బాజుమల్లాయిగూడెంకు చెందిన సుధాకర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలం చాప్రికి చెందిన భీంరావు (40), ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన పెండోర్ లక్ష్మణ్ (60) ఉన్నారు. నాలుగేండ్లలో 57 వన్యప్రాణులు విద్యుదాఘాతానికి గురయ్యా యి. అక్రమ వేటకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఫర్గెయిన్ హెచ్చరించారు. ‘క్యాచ్ ది ట్రాప్’ డ్రైవ్‌లో భాగంగా వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వలలు, ఉచ్చులు, సామగ్రిని ఆయన మీడియాకు ప్రదర్శించారు. డీఎఫ్‌వోలు, ఫారెస్ట్ కన్జర్వేటర్లతోపాటు క్షేత్రస్థాయి సిబ్బంది కృషే ఈ విజయానికి కారణమని అభినందించారు.