(నమస్తే తెలంగాణ) హైదరాబాద్, నవంబర్ 26 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 60 ఏండ్ల క్రితం ప్రారంభమైన వర్సిటీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. డిసెంబర్లో నిర్వహించే వర్సిటీ వజ్రోత్సవ ఉత్సవాలు (డైమండ్ జూబ్లీ) ఫ్లయర్, లోగోలను కమ్యూనిటీ సైన్స్ కళాశాల లో మంగళవారం మంత్రి తుమ్మల విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు వర్సిటీ భవిష్యత్తును నిర్ణయించేలా ఉండాలని తెలిపారు. వీసీ జానయ్య మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాలలను ప్రారంభించేందుకు తమ అనుమతి తప్పనిసరి ఉండాలని ఐకార్ సూచించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో డిసెంబర్ 7, 8 తేదీల్లో నిర్వహించనున్న వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాంతయ్య, బాలమల్లేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముగ్దుం భవన్లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బీకేఎంయూ జాతీయాధ్యక్షుడు పెరిమ స్వామి హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో జాతీయ ఉపాధిహామీ పథకంపై సెమినార్ నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యావేత్తలు, మేధావులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.