రఘునాథపాలెం, మార్చి 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్లే మిర్చి ధరలు పతనమైనట్టు వ్యవసాయ శాస్త్రవేత్త శరత్‌బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధానమైన మిర్చి ఎగుమతులపై ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతోనే ఈ ఏడాది మిర్చి ధరలు భారీగా తగ్గినట్టు తెలిపారు. నిరుడు పండించిన మిర్చి పంట పెద్ద మొత్తంలో నిల్వ ఉండటం, ప్రపంచ వ్యాప్తంగా మిర్చి దిగుమతి చేసుకునే దేశాల్లో పలు సంక్షోభాలు ఏర్పడటం వంటివి కూడా మరికొన్ని కారణాలని ఆయన పేర్కొన్నారు. ‘మిర్చి ధరల పతనం – పరిష్కార మార్గం’ అనే అంశంపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్లో మంగళవారం నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. దేశం దిగుమతి సుంకాన్ని పెంచిందనే కారణంతో కొన్ని దేశాలకు ఎగుమతులు నిలిచిపోయినట్టు తెలిపారు. దీనికితోడు ఈ ఏడాది తామరపురుగు, చీడపీడల వల్ల మిర్చి దిగుబడి కూడా చాలా వరకు తగ్గిందని అన్నారు.
ఐక్య పోరాటాలతోనే వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేసి క్వింటాకు రూ.25 వేల చొప్పున నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దొండపాటి రమేశ్ అధ్యక్షతన జరిగిన సెమినార్లో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, రైతు సంఘాల నాయకులు బాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు.