హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సాగు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి రైతుభరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఈ యాసంగిలో ఎంత భూమికి, ఎంతమంది రైతులకు రైతుభరోసా ఇస్తారనే చర్చ జరుగుతున్నది. ఈ నిబంధన ప్రకారం తమకు రైతుభరోసా వస్తుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. సాగు యోగ్యమైన భూమిపై వ్యవసాయ శాఖ లెక్క తేల్చినట్టు తెలిసింది. ఒక్క పంట పండే భూములు, నీళ్ల కొరతతో సాగు చేయనప్పటికీ విత్తనాలు వేసేందుకు అనుకూలంగా ఉండే భూములను సాగు యోగ్యమైన భూములుగా పరిగణించినట్టు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.48 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్టు వ్యవసాయ శాఖ లెక్క కట్టినట్టు తెలిసింది.
ఇందులో 1.36 కోట్ల ఎకరాలు వ్యవసాయ పంటల భూమి కాగా, మరో 12 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలు పండించే భూములున్నాయి. ఆయా భూములను కలిగిన రైతుల సంఖ్య సుమారు 65-68 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యాసంగిలో కాంగ్రెస్ సర్కారు 1.48 కోట్ల ఎకరాలకు రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటుంది. రైతుభరోసాకింద ఎకరాకు ప్రతి సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్నది కాంగ్రెస్ ఎన్నికల హామీ. కానీ, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు కాకుండా పన్నెండు వేల చొప్పున, అదీ సాగు యోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటికే సాగు యోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ లెక్క తేల్చినందున ఈ సీజన్లో ఎకరాకు రూ.ఆరు వేల చొప్పున రూ.8,880 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది.
సాగు చేసిన భూమికా? సాగు యోగ్యమైన భూమికా?
మొన్నటివరకు సీఎం రేవంత్రెడ్డితోసహా మంత్రులంతా పంట సాగు చేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడేమో సీఎం రేవంత్రెడ్డి సాగు యోగ్యమైన భూమికి ఇస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొదట చెప్పినట్టుగా పంటలు సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తారా? లేక సాగు ఆమోదయోగ్యమైన భూమికి ఇస్తారా? ఇందులోనూ కోత పెడతారా? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. పథకాల అమలులో కాంగ్రెస్ సర్కారు కోతలు పెడుతుండటం, పూటకో మాట మాట్లాడుతుండటంతో ఇటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రేవంత్రెడ్డి సర్కారు మళ్లీ మాట తప్పి, సాగు యోగ్యమైన భూమికి కాకుండా కేవలం పంట సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తే, భారీ విస్తీర్ణంలో భూమికి రైతుభరోసా కోత పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సాగు చేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తే, ఈ యాసంగిలో సుమారు 66-70 లక్షల ఎకరాలకు కోత పడటం ఖాయం.
ఒకవేళ సాగు చేసిన భూమికే ఇస్తే..