హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కోపం ఉంటే వీపు మీద కొట్టు.. కానీ పొట్ట మీద కొట్టకు అంటరు! పొట్ట మీద కొడితే ఆ గుండె రగిలిపోతుంది. ఇప్పుడు అగ్నిపథ్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు కూడా ఇలాగే ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. సైన్యంలో చేరాలనే కలను నెరవేర్చుకొనేందుకు యువకులు ఏండ్ల పాటు కష్టపడి, దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించి, రెండేండ్లుగా రాత పరీక్ష కోసం నిరీక్షిస్తున్నారు. కరోనా పేరుతో అనేక సార్లు రాత పరీక్షను వాయిదా వేసి, చివరికి అగ్నిపథ్‌తో అగ్గి రాజేసిందని పలువురు విమర్శిస్తున్నారు.
నాలుగేండ్ల శిక్షణ, ఆపై నిర్వహించే పరీక్షల్లో అర్హత, అందులోనూ 25 శాతం మందికే ఉద్యోగం.. అన్న మార్గదర్శకాలు యువతకు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. నోటికాడి బుక్కను కేంద్రం నేలపాలు చేసిందనే వాస్తవాన్ని గుర్తించి రగిలిపోయారని, ఆ ఆక్రోశంలో నుంచి పట్టుకొచ్చిందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన అని పేర్కొంటున్నారు. కొవిడ్-19 నిబంధనల పేరుతో రాత పరీక్షను వాయిదా వేసిన బోర్డు.. అదే సమయంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్)కు పోస్టుల రాత పరీక్షను మాత్రం నిర్వహించింది. ఇదే యువత కడుపు మంటకు కారణమయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం 2020-21లో 97 ర్యాలీలు నిర్వహించాలనుకొన్నా, 47 ర్యాలీలు మాత్రమే నిర్వహించారు. అందులో నాలుగింటికి మాత్రమే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టి రిక్రూట్ చేశారు. 2021-22లో 87 ర్యాలీలు అనుకొంటే నాలుగు మాత్రమే నిర్వహించారు. వీటికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించలేదు. 2021 మే లో గుంటూరులో ఒక ర్యాలీ నిర్వహించారు. దానికి ఫిజికల్, మెడికల్ నిర్వహించారు. కానీ, రాత పరీక్ష జరగలేదు. వేల మంది అభ్యర్థులు రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అగ్నిపథ్‌ను కేంద్రం ప్రకటించటంతో పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. ఆ ఆవేశంతోనే అంతా కలిసి వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా చర్చించుకొని ఆందోళనకు పాల్పడట్టు సమాచారం.
నోటిఫికేషన్ : 2021 జనవరి
దరఖాస్తులు : 2021 జనవరి 30 నుంచి
ఫిబ్రవరి 17 వరకు
(తెలంగాణ నుంచి దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకొన్నారు)
అడ్మిట్ కార్డుల జారీ : 2021 ఫిబ్రవరి 18
దేహదారుఢ్య పరీక్ష : 2021 మార్చి 5
ఆరోగ్య పరీక్షలు : 2021 మార్చి 6
(సీఈఈ-2021కు అర్హతసాధించినవారు 4వేల మంది)
2021 మే 30 (వాయిదా)
2021 సెప్టెంబర్ 26 (వాయిదా)
2021 అక్టోబర్ 31 (వాయిదా)
2021 నవంబర్ 28 (వాయిదా)
.. మళ్లీ రాత పరీక్ష ప్రకటన రాలేదు వచ్చింది.. అగ్నిపథ్ పథకమే!