KCR | కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర్శించారు. ఇది అసలు రాజకీయమా అని ప్రశ్నించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆనాడు బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని కేసీఆర్ గుర్తుచేశారు. నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనని చెప్పానని.. అన్నట్లుగానే పెట్టలేదని తెలిపారు. మీటర్లు పెట్టకపోతే 30 వేల కోట్లు కట్ చేస్తానని మోదీ అన్నాడని.. కట్ చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 30 వేల కోట్ల ఆదాయాన్ని వదులుకుని కూడా తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టనివ్వలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లి కరెంటు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అప్పటి రూ.30వేల కోట్లు తీసుకుని.. వ్యవసాయ కరెంటు మీటర్లకు మోటర్లు పెట్టేందుకు సంతకం పెట్టారని పేర్కొన్నారు. తొందరలోనే రాష్ట్రంలోని వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు వస్తాయని తెలిపారు. వీటిని ఎదుర్కొందామా.. మీటర్లు పెట్టకుండా యుద్ధం చేస్తామా అని పిలుపునిచ్చారు.
రైతులు మంచిగుండాలి.. వ్యవసాయం మంచిగుండాలి.. పల్లెలు బాగుండాలి.. వృత్తి పనులు బాగుండాలనే కదా మనం అంటున్నామని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలు ఇప్పించామని.. ఇప్పుడొస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని.. ఇప్పుడు ఇస్తున్నారా అని అడిగారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే.. పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెసోళ్లు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని.. ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మీ అని రూ.2500 ఇస్తామని చెప్పారని.. ఇచ్చారా అని ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చారా అని అడిగారు. అలా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు.
అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్నం ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పోరాటం చేయాల్సిందేనని.. వాళ్లను నిలదీయాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని స్పష్టం చేశారు.