సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ) : ఎలివేటేడ్ కారిడార్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులను కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. కోల్పోతున్న భూములకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన పరిహారాన్ని పరిహాసం చేస్తోంది. ఈ క్రమంలో భూములకు ఇచ్చే పరిహారాన్ని ఏడాదిన్నర కాలంగా తేల్చని సర్కారు.. కాలయాపన చేస్తూనే ఉంది. దాదాపు 16 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టులో 1600కు పైగా ఆస్తులను కోల్పోతుండగా… ఇప్పటికే రక్షణ శాఖ పరిహారాన్ని సెటిల్ చేసింది. కానీ ప్రైవేటు ఆస్తుల విషయంలోనే ఓవైపు బాధితుల న్యాయపోరాటం, మరోవైపు బలవంతంగా లాక్కోవాలనే సర్కారు కుట్రలతో జనాలు నలిగిపోతున్నారు.
జేబీఎస్ నుంచి తూంకుంట మార్గంలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు జటిలం చేస్తుంది. ప్రజా అవసరాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు పేరిట కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తూనే ఉంది. అత్యంత కీలకమైన వాణిజ్య సముదాయాలను కలిగి ఉన్న ఈ ప్రాంతంలో బాధితులను నిండా ముంచేలా వ్యవహారిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రాజెక్టు వెడల్పును 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించాలనే డిమాండ్‌పై ఇప్పటికీ స్పష్టత నివ్వనీ సర్కారు…
తాజాగా పరిహారం విషయంలోనూ నాన్చుతూనే ఉంది. మార్కెట్ విలువ ఆధారంగా తాము కోరిన పరిహారం ఇస్తే గానీ భూములు ఇచ్చేది లేదనీ దాదాపు వందలాది కేసులు కోర్టులో ఉన్నాయి. ఆ కేసులు తేలేంత వరకు సర్కారు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌కు సహకరించేది లేదనీ తేల్చి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం భూసేకరణ పరిహారాన్ని తేల్చకుండా, బాధితులను విభజించి పాలించిన చందంగా భూములను తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
తెరమీదకు టీడీఆర్…
ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం, భూసేకరణ పరిహారానికి సమానంగా ఉండటంతో నిధుల సర్దుబాటు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే అరకొర నిధులతో కొట్టుమిట్టాడుతూ శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచినా ప్రాజెక్టును చేపట్టలేదు. ఈ క్రమంలో సర్కారు తెరమీదకు మరో విధానాన్ని తీసుకువచ్చింది. తొలుత భూములు కోల్పోతున్నవారికి బదులుగా విలువ ఆధారంగా భూములు ఇస్తామంటూ భూసేకరణ మొదలుపెట్టింది. కానీ ఇప్పటివరకు స్పష్టమైన విధివిధానాలను ప్రకటించకుండానే నిర్లక్ష్యం చేసింది. ఇక తాజాగా భూ నిర్వాసితులకు పరిహారంగా టీడీఆర్ బాండ్లను ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంతమంది బాధితులకు చెక్కుల రూపంలో పరిహారం ఇచ్చిన… ఇప్పటికీ బాధితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమా చేయలేదు.
ఇక చేతికి డబ్బులు ఇచ్చే పరిస్థితులు
లేకపోవడంతో… బాధితులకు టీడీఆర్ బాండ్లను మంజూరు చేసి, ఎలాగైన ప్రాజెక్టుకు అవసరమైన భూములను సేకరించాలని చూస్తోంది. ఈ క్రమంలో టీడీఆర్ నిబంధనల్లో మార్పులు చేసిన సర్కారు… క్యూర్ పరిధిలో చేపట్టే భూసేకరణకు ఇచ్చే టీడీఆర్‌లను 11జిల్లాల్లో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందనీ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త జీవో ప్రకారం కూడా కంటోన్మెంట్ పరిధిని ప్రత్యేకంగా పేర్కొనడంతో… ఎలివేటెడ్ బాధితులకు ఇక టీడీఆర్ బాండ్లు మాత్రమే పరిహారంగా వస్తాయనే నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో సర్కారు చేస్తున్న ప్రయత్నాలను రాజీవ్ రహదారి భూముల పరిరక్షణ జేఏసీ ప్రెసిడెంట్ తేలుకుంట సతీష్ గుప్తా…. మాట్లాడుతూ రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాంత ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతోంది. చర్చలు, సమావేశాలతో బాధితులకు అన్యాయం చేస్తున్నది. పరిహారాన్ని తేల్చకుండానే భూములు లాక్కోవాలని చూస్తున్నది.
కనీసం ఏ విధంగా బాధితులకు పరిహారం ఇస్తారనే అంశాన్ని కూడా సర్కారు స్పష్టం చేయడం లేదు. ఈ క్రమంలో కొత్తగా టీడీఆర్ బాండ్ల రూపంలో పరిహారం ఇవ్వాలనే ప్రతిపాదన తమకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఎందుకంటే మార్కెట్ విలువ ఇటీవల సవరణ చేయకుండా పాత ధరలోనే ఇక్కడి భూములను ఉంచింది. ఇప్పుడు టీడీఆర్ జారీ చేస్తే పాత రేట్ల ద్వారానే మంజూరయ్యే ప్రమాదం ఉంది. సర్కారు చేసిన తప్పిదం వందలాది ఆస్తులకు విలువ లేకుండా పోతుంది. అందుకే తమ భూములకు పరిహారాన్ని నగదు రూపంలోనే, అది కూడా ప్రస్తుత మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకుని నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.